- Home
- Entertainment
- Mayasabha Review: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ, రేటింగ్.. పొలిటికల్ డ్రామా ఆకట్టుకుందా ?
Mayasabha Review: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ, రేటింగ్.. పొలిటికల్ డ్రామా ఆకట్టుకుందా ?
ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన మయసభ వెబ్ సిరీస్ సోనీ ఓటీటీలో రిలీజ్ అయింది. దేవాకట్టా, కిరణ్ జయ్ కుమార్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

మయసభ రివ్యూ
ప్రముఖ దర్శకుడు దేవకట్టా, కిరణ్ జయ్ కుమార్ కలిసి తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు మధ్య స్నేహాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. అయితే ఈ విషయాన్ని మయసభ టీం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దీనితో దేవకట్టా ఆ పాత్రలని ఎలా చూపించారు, అసలు మయసభ సిరీస్ లో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన రాజకీయ అంశాలు ఏమున్నాయి అని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. దీనితో మయసభ సిరీస్ పై మంచి బజ్ నెలకొని ఉంది.
ఈ వెబ్ సిరీస్ లో ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించారు. నాజర్, శ్రీకాంత్ అయ్యంగార్, దివ్య దత్త, తాన్య రవిచంద్రన్,సాయి కుమార్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్ పోషించిన పాత్ర ఎన్టీఆర్ ని పోలి ఉంది. 9 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకునే విధంగా ఉందా ? పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సిరీస్ లో ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయి ? లాంటి విషయాలని సమీక్షలో తెలుసుకుందాం.
కథ
నర్సిపల్లి చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు(ఆది పినిశెట్టి), పులిచెర్లకి చెందిన ఎంఎస్ రామిరెడ్డి (చైతన్య రావు) కాలేజీ విద్యార్థులుగా ఉంటారు. వీరికి ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఇద్దరూ చదువులో బాగా రాణిస్తుంటారు. చదివిన చదువు చాలు ఇక వ్యవసాయం చేయమని కృష్ణమ నాయుడు కుటుంబ సభ్యులు బలవంతం చేస్తుంటారు. కానీ కృష్ణమనాయుడుకి వ్యవసాయంపై ఆసక్తి ఉండదు. వ్యవసాయం వల్ల ఏమీ మిగలదు అని, వ్యవసాయం చేసే పద్ధతి మారాలని కృష్ణమనాయుడు భావిస్తుంటారు. పై చదువులు చదవాలనే కోరిక బలంగా ఉంటుంది. పదిమందిని బాగుచేసే శక్తి చదువుకున్నోడికి మాత్రమే ఉంటుందని కృష్ణమ నాయుడు నమ్ముతాడు.
మరోవైపు రామిరెడ్డికి రైతులు అంటే చాలా గౌరవం ఉంటుంది. డాక్టర్ చదువుతున్నప్పటికీ వ్యవసాయాన్ని మించిన చదువు లేదని భావిస్తుంటారు. అందుకే రైతుల పట్ల రామిరెడ్డికి సానుభూతి ఉంటుంది. మరోవైపు తన తండ్రి చేసే ఫ్యాక్షన్ గొడవలు అంటే రామిరెడ్డికి ఇష్టం ఉండదు. ఫ్యాక్షన్ గొడవల వల్ల నష్టమే ఎక్కువని రామిరెడ్డి భావిస్తుంటారు.
ఇలా వేర్వేరు భావజాలాలు ఉన్న కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ఇద్దరికీ కామన్ గా ఒక ఆకాంక్ష ఉంటుంది. అదేంటంటే ఇప్పటి రాజకీయాలు మారి దేశం అభివృద్ధి చెందాలని భావిస్తుంటారు. వీరిద్దరూ ఎలా స్నేహితులు అయ్యారు? రాజకీయాల్లోకి వీరి ఎంట్రీ ఎలా జరిగింది ? రాజకీయాల్లో వీరికి ఎదురైన అనుభవాలు ఏంటి ? స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వెబ్ సిరీస్ చూడాలి.
విశ్లేషణ
తెలుగు రాష్ట్రాల రాజకీయాలని శాసించిన ఇద్దరు లెజెండ్రీ రాజకీయ నాయకుల కథ అని అధికారికంగా చెప్పకుండానే వారి కథని దర్శకుడు దేవకట్టా ఆవిష్కరించిన విధానం బావుంది. వాళ్లిద్దరూ ప్రత్యర్థులుగా ఎలా ఉండేవారో ఈ తరం వారికి బాగా తెలుసు. కానీ వారిద్దరూ స్నేహితులుగా ఎలా ఉండేవారు అనేది ఈ జనరేషన్ కి తెలియదు. ఆది పినిశెట్టి పోషించిన కృష్ణమ నాయుడు, చైతన్య రావు పోషించిన రామిరెడ్డి పాత్రలతో ఇద్దరి స్నేహాన్ని దేవకట్టా అద్భుతంగా ఆవిష్కరించారు.
వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ(చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి) నిజంగానే ఇంత మంచి స్నేహితులుగా ఒకప్పుడు ఉన్నాయా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే విధంగా ఢిల్లీలో తెలుగు రాజకీయ నాయకులకు ఎదురయ్యే అవమానాలు చూపించిన విధానం కూడా నాకు కొత్తగా అనిపించింది.
తొలి ఎపిసోడ్ లో కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ల మనస్తత్వాన్ని వేర్వేరుగా ఆవిష్కరిస్తూ ఆసక్తికరంగా నడిపించారు. కృష్ణమనాయుడు కుటుంబం ఎదుర్కొనే వ్యవసాయ సమస్యలు, అప్పటి దళారుల అక్రమాలని చూపించిన విధానం బావుంది. దళారుల అటకట్టించే తెలివైన వ్యక్తిగా కృష్ణమ నాయుడు కనిపిస్తాడు. రామిరెడ్డి తండ్రి శివారెడ్డి చేసే ఫ్యాక్షన్ గొడవలు ప్రారంభంలో ఆసక్తిగా ఉంటాయి. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో కూడా అవి కంటిన్యూ కావడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు.
మధ్యలో రామిరెడ్డి తన మరదలితో వచ్చే లవ్ సీన్లు, కాలేజీలో కృష్ణమ నాయుడు ప్రేమ సన్నివేశాలు కథకి కాస్త స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి. కృష్ణమ నాయుడుకి స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లో ఎదురుదెబ్బ తగిలే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాజకీయాల్లో రాణించాలంటే ఆశయం, అజెండా మాత్రమే ఉంటే చాలని నమ్మే కృష్ణమ నాయుడుకి స్టూడెంట్ ఎలక్షన్స్ ద్వారా కనువిప్పు కలుగుతుంది. రాజకీయాల్లో రాణించాలంటే కుల సమీకరణాలు కూడా అవసరం అనే అభిప్రాయం అక్కడి నుంచే మొదలవుతుంది.
వీళ్లిద్దరి మధ్య స్నేహం బలపడేలా.. రాజకీయాల వైపు అడుగులు వేసేలా డైరెక్టర్ దేవాకట్టా టీస్టాల్ వద్ద ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఆ సన్నివేశం బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఇంతలో కృష్ణమనాయుడు లవ్ స్టోరీలో వచ్చే ట్విస్ట్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మధ్యలో దర్శకుడు దేవాకట్టా రాయలసీమ ఫ్యాక్షన్ ని, బెజవాడ రౌడీయిజాన్ని కూడా టచ్ చేశారు. ఆ సన్నివేశాలు అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సన్నివేశాలని దర్శకుడు సపరేట్ ట్రాకులుగా నడిపించినట్లు అనిపిస్తుంది. ఆ సీన్లు కథలు అంతగా సింక్ కాలేదు.
కృష్ణమ నాయుడు, రామిరెడ్డి కలిసి ఒక జాతీయ పార్టీలోకి వెళ్లి అక్కడ గుర్తింపు పొందే విధానం ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్సీఆర్(సాయి కుమార్) పాత్ర ఎంట్రీ తో కథ నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. ఢిల్లీ గద్దెపై నియంతలా వ్యవహరించే ఐరావతి (దివ్య దత్తా) పాత్రని దర్శకుడు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నియంతలా వ్యవహరించేందుకు కావలసిన బాడీ లాంగ్వేజ్ ని ఆమె అద్భుతంగా ప్రదర్శించారు. ఆమె సన్నివేశాలు అప్పటి ఢిల్లీ రాజకీయాలని ప్రతిబింభించేలా ఉంటాయి.
ఆర్సీఆర్ పార్టీ పెట్టడం, విజయం సాధించడం లాంటి సన్నివేశాలు చక చకా జరిగిపోతాయి. అప్పటి రాజకీయ నాయకులు పదవుల కోసం ఢిల్లీ అధినేతల దగ్గర ఎలా బానిసత్వం చేశారు ? రబ్బరు స్టాంపులుగా ఎలా మారారు అనే సన్నివేశాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. కృష్ణమ నాయుడు, ఆర్సీఆర్ అల్లుడిగా మారే సన్నివేశం ఎంతో అందంగా ఉంటుంది. మామ పార్టీ చేతిలో ఎదురుదెబ్బ తిన్న కృష్ణమ నాయుడు.. చివరికి రాజకీయ భవిష్యత్తు కోసం అదే పార్టీలోకి వెళ్లే సన్నివేశంతో కథ ముగిస్తుంది. కృష్ణమ నాయుడు, రామిరెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనే సన్నివేశాలని సీజన్ 2 కోసం దర్శకుడు దాచిపెట్టుకున్నారు.
డైరెక్టర్ దేవా కట్టా.. కృష్ణమ నాయుడు, రామిరెడ్డి రెండు పాత్రలని బ్యాలెన్స్ చేస్తూ ఎవ్వరినీ తక్కువ కాకుండా చూపించిన విధానం నాకు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. కులాల విషయంలో ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకునే సన్నివేశాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
నటీనటులు
కృష్ణమ నాయుడు, రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు ఏమాత్రం వంక పెట్టలేని విధంగా నటించి మెప్పించారు. స్టూడెంట్స్ గా ఉన్నప్పటి నుంచి రాజకీయ నాయకులుగా ఎదిగే వరకు తమ బాడీ లాంగ్వేజ్ లో వీరిద్దరూ చూపిన వేరియషన్స్ ఆకట్టుకుంటాయి. వీరి తర్వాత అంతటి అటెన్షన్ పొందిన పాత్ర దివ్య దత్తా. ఆమె ఐరావతి పాత్రలో పర్ఫెక్ట్ గా నటించారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పదవి కోసం పాకులాడే రాజకీయ నాయకుడి పాత్రలో నెగిటివ్ గా నటిస్తూనే నవ్వులు పూయించారు.
కృష్ణమనాయుడు ప్రేయసి పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది. ఆమె పాత్రలో ఉండే ట్విస్ట్, ట్రాన్స్ ఫర్మేషన్ ఆకట్టుకుంటాయి. నాజర్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. ఇక ఆర్సీఆర్ పాత్రలో సాయి కుమార్ చివరి ఎపిసోడ్లలో ఎంట్రీ ఇచ్చారు. కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ఫోకస్ పెట్టడం కోసం సాయి కుమార్ పాత్రని చుట్టేసినట్లు అనిపిస్తుంది.
టెక్నీషయన్లు
దర్శకులు దేవకట్టా, కిరణ్ జయ్ కుమార్ చేసిన ఈ ప్రయత్నానికి వారిని తప్పకుండా అభినందించాల్సిందే. ప్రజలకు ప్రత్యర్థులుగా మాత్రమే తెలిసిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య స్నేహం ఉందని గుర్తుచేసేలా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. వారి మధ్య ప్రజలకు తెలియయని స్నేహాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ వెబ్ సిరీస్ కి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. వెబ్ సిరీస్ లలో గొప్ప పాటలు ఆశించలేం. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సురేష్, జ్ఞానశేఖర్ ల సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి.
ఫైనల్ గా
వేర్వేరు భావజాలాలు కలిగిన ఇద్దరు రాజకీయ నాయకులు స్నేహితులు అయితే ఆ కథ తప్పనిసరిగా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంజాయ్ చేసేలా, ఎంగేజింగ్ గా అనిపించేలా ఉన్న 'మయసభ' సిరీస్ ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు.
రేటింగ్ : 3.25/5