- Home
- Entertainment
- శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పోలీసులు లుకౌట్ నోటీసులు..రూ. 60 కోట్ల భారీ చీటింగ్ ఎలా చేశారంటే
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పోలీసులు లుకౌట్ నోటీసులు..రూ. 60 కోట్ల భారీ చీటింగ్ ఎలా చేశారంటే
ముంబై పోలీసులు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. వ్యాపారి దీపక్ కోఠారి ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోంది.

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. రూ.60 కోట్ల మోసం కేసులో వీరిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, వ్యాపారి దీపక్ కోఠారి ఫిర్యాదు మేరకు 2015 నుంచి 2023 మధ్యకాలంలో శిల్పా-రాజ్ దంపతులు ఆయనను మోసం చేశారని ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న వారి కంపెనీ వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడిగా చూపుతూ మొత్తం రూ.60 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపణ చేశారు.
ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నప్పటికీ, తర్వాత పెట్టుబడిగా చూపుతూ పన్ను ఆదా చేసేందుకు ప్రయత్నించారని కోఠారి ఆరోపించారు. డబ్బును 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని, 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి తన వ్యక్తిగత హామీ పత్రాన్ని కూడా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కానీ కొద్దికాలానికే శిల్పా కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అలాగే, కంపెనీపై రూ.1.28 కోట్లు విలువైన ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తోందన్న విషయం కూడా తనకు తెలియజేయలేదని కోఠారి అన్నారు. దీనిపై ముంబై పోలీసులు ఇప్పటికే సంస్థ ఆడిటర్‌ను విచారణకు పిలిచారు. శిల్పా-రాజ్ దంపతుల ట్రావెల్ రికార్డులు కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ కేసులో ఉన్న ఆరోపణలను శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఖండించారు. ఈ కేసు నిరాధారమని, తమపై దుష్ప్రచారం కోసం కావాలనే కేసు వేశారని వారు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ కేసు ముంబై ఆర్థిక నేరాల విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. కేసు విచారణ సమయంలో శిల్పా, రాజ్ దంపతులు దేశం విడిచిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

