ANR: ఏఎన్నార్ వానపాటకు.. కేసిఆర్ రొమాంటిక్ రివ్యూ.. ఆ పాట అంటే ఎందుకంత ఇష్టం..
ANR: రాజకీయాలు, పాలన మాత్రమే కాదు.. సినిమాలు, కళలపై కూడా మాజీ సీఎం కేసీఆర్ కు మక్కువ ఎక్కువ. సినిమాలు, పాటలపై కేసీఆర్ రివ్యూ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓ సారి ఏఎన్నార్ వానపాటపై కేసీఆర్ ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా?
నినిమా- రాజకీయం మధ్య విడదీయలేని బంధం..
సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఎంతో మంది సినీప్రముఖులు రాజకీయాల్లో రాణించారు.. ఎంతో మంది రాజకీయ నాయకులు సినిమా వారితో అనుబంధం కలిగి ఉన్నారు. అలాంటి వారిలో కేసీఆర్ కూడా ఒకరు. కేసీఆర్ కు ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ కేసీఆర్ కు రాజకీయ గురువు. ఇక కేసీఆర్ ఎంతో అభిమానించే సినీ ప్రముఖులలో కృష్ణ, డైరెక్టర్ విశ్వనాథ్, సీనారే, లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇక ఇప్పటి సినిమా వారిలో చిరు, నాగార్జున, లాంటి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కేసీఆర్. అంతే కాదు కేసీఆర్ సినిమాల మీద, సినిమా పాటల మీద కూడా రివ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓ సారి ఆయన ఏఎన్నార్ వానపాటలపై ఇచ్చిన విశ్లేషణ అందరిని ఆకట్టుకుంది.
ఏఎన్నార్ పాటకు కేసీఆర్ రివ్యూ..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాటి స్వర్ణయుగపు సినిమాలకు, అప్పట్లో దిగ్గజ నటులు నటించిన చిత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక సందర్భంలో కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు) నాటి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలోని పాటల గురించి, వాటి వెనక ఉన్న అద్భుతమైన భావ సౌందర్యం గురించి ఎంతో చక్కగా వివరించారు. గతంలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు కు సంబంధించిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన కేసీఆర్... ఏఎన్నార్ వానపాట గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
వర్షం, మెరుపు , బిత్తర చూపుల భావన
అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా పాటలను గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ ఆనాటి కవుల ప్రతిభను, సాహిత్య లోతును ప్రశంసించారు. "చిటపట చినుకులు పడుతూ ఉంటే..." అనే వాతావరణంలో, ఆకాశంలో మెరిసే మెరుపు వెలుగులో ఒక అద్భుతమైన దృశ్యాన్ని కవులు ఎంతటి సూక్ష్మ పరిశీలనతో వర్ణించేవారో ఆయన వివరించారు. ఆకాశంలో మెరుపు మెరిసేది కేవలం ఒక లిప్త కాలం మాత్రమే.
ఆ అత్యంత స్వల్ప సమయంలో ప్రియుడు తన ప్రియురాలి కళ్లలోకి సూటిగా చూసినప్పుడు, ఆ మెరుపు వెలుగులో ఆమె కళ్లలో కనిపించే బిత్తర చూపులు, సిగ్గుల మొహమాటాలు ఎంతో సహజంగా చిత్రీకరించబడేవి. ఆ కొద్ది క్షణాల భావోద్వేగాన్ని పాట రూపంలో మలచడం నాటి కవుల గొప్పదనానికి నిదర్శనం. అని కేసీఆర్ అన్నారు.
నాటి సాహిత్యానికి నేటి కాలానికి తేడా..
అప్పట్లో వచ్చిన సినిమా పాటలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, ప్రతి పదం వెనుక ఒక అర్థవంతమైన భావన, మానవ సంబంధాలలోని సున్నితమైన కోణాలు ఉండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక తరం పాటలలో హుషారైన సంగీతం ఉంటున్నప్పటికీ, నాటి పాటల్లో కనిపించే ఆ సాహిత్య మాధుర్యం, లోతైన అర్థాలు చాలా మందికి తెలియకుండా పోతున్నాయి. నాటి కాలపు పాటల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో నేటి యువతకు అర్థం కావడం కష్టంగా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.





