- Home
- Entertainment
- Movie Reviews
- Summer Holidays Movie Review: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ.. రోహన్, అరుణ్ దేవ్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Summer Holidays Movie Review: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ.. రోహన్, అరుణ్ దేవ్ నటించిన మూవీ ఎలా ఉందంటే?
బాలనటులు రోహన్, అరుణ్ దేవ్, ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సమ్మర్ హాలిడేస్`. ఈ మూవీ నేడు శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ
మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబి ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సమ్మర్ హాలిడేస్`. శ్రీకర్ నయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. చిన్న పిల్లలు, వారి చదువు, ఆటల, పేరెంట్స్ తో రిలేషన్, సమ్మర్లో హాలిడేస్‌ని ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకుంది. దీపావళి స్పెషల్‌గా నేడు శుక్రవారం(నవంబర్ 6)న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
సమ్మర్ హాలిడేస్ మూవీ కథ
ఆర్వీ(మాస్టర్ ఆరుణ్ దేవ్) సిటీలో ప్రైమరీ స్కూల్లో చదువుతుంటాడు. వాళ్ల అమ్మ(వాసుకి) హౌజ్ వైఫ్. నాన్న(హర్ష వర్థన్) చాలా స్టిక్ట్. ఎప్పుడూ చదువు చదువు అంటూ అరుస్తుంటాడు. ఆర్వీకే క్రికెట్ అంటే ఇష్టం. ఆడుకుంటానని చెబితే, ఈ సారి ఫైనల్ ఎగ్జామ్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే క్రికెట్ కిట్టు కోనిస్తానని చెబుతాడు. కానీ ఆర్వీకి 10వ ర్యాంక్ వస్తుంది. దీంతో బాగా అరుస్తాడు. దీంతో తండ్రి అంటే భయపడిపోతుంటాడు ఆర్వీ. కానీ అమ్మ ఓదార్చుతుంది. ఈ సారి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఊరికి పంపిస్తుంది.
దీంతో కథ హైదరాబాద్ నుంచి తోటవారిపాలెంకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ అమ్మమ్మ సుశీలమ్మ(జయసుధ) ఉంటుంది. ఆర్వీ అక్కడ స్కూల్‌కి వెళ్తాడు. అందులో కేవీ(మాస్టర్ రోహన్) పరిచయం అవుతాడు. కేవీకి నాన్న లేడు. అమ్మ(హర్షిణి) పేదరికంలో మగ్గుతుంది. ఆమె ఆర్వీ అమ్మమ్మ ఇంట్లోనే ఇంటిపనులు చేస్తుంటుంది. వచ్చిన డబ్బుతో ఇళ్లు గడవమే కష్టంగా ఉంటుంది. కనీసం చీరలు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. దీంతో ఊర్లో అంతా అవమానిస్తారు. ఆ అవమానాలను ప్రత్యక్షంగా చూస్తాడు కేవీ. ఎలాగైనా అమ్మకి మంచి ఖరీదైన చీర కోనివ్వాలని నిర్ణయించుకుంటాడు.
దీంతో వర్మ(రాజీవ్ కనకాల) మామిడి తోటలో కాత కాయని చెట్లని లీజుకి తీసుకుంటాడు. కానీ అవి కాత కాయవు, దీంతో నానా తంటాలు పడుతుంటాడు? కేవీ పరిచయం అయ్యాక ఆర్వీలో వచ్చిన మార్పేంటి? ఏం నేర్చుకున్నాడు? కేవీకి ఆర్వీ ఎలాంటి హెల్ప్ చేశాడు? వీరిద్దరు కలిసి ఏం చేశారు? మామిడి చెట్లు కాత కాశాయా? అమ్మకి కొత్త చీర కోనిచ్చాడా? ఇది సందేశం ఏంటి? పిల్లలను ఎలా పెంచాలనేది, చదువుల విషయంలో ఎలా ఉండాలనేది? అమ్మమ్మ ఇంటి ప్రత్యేకం ఏంటి? అనే అంశాల సమాహారమే ఈ మూవీ.
సమ్మర్ హాలిడేస్ మూవీ విశ్లేషణ
చిన్నప్పటి జ్ఞాపకాలను ఆవిష్కరించే చిత్రాలు రావడం లేదు. టీనేజ్ మూవీస్ అడపాదడపా వస్తుంటాయి. ఆపై ఏజ్‌తో మూవీస్ చాలా వచ్చాయి. కానీ బాల్యంలోని తీపిగుర్తులను ఆవిష్కరించే చిత్రాలు చాలా అరుదు. ఇంకా చెప్పాలంటే రావడం లేదు. అదే సమయంలో సమ్మర్ హాలిడేస్ బేస్డ్ గా సినిమాలు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఆ విషయంలో ఈ సమ్మర్ హాలిడేస్ మూవీ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. చిన్నప్పటి తీపిగుర్తులను, వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తే వచ్చే తీపి గుర్తుల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.
దర్శకుడు శ్రీకర్ నయన్ చాలా బాగా ఈ మూవీని తెరకెక్కించాడు. కొంత ఫన్, ఇంకొంత ఎమోషన్స్, మరికొంత పిల్లల స్నేహం, ఫ్యామిలీ బాండింగ్, అదే సమయంలో చదువుల ప్రెజర్ వంటి అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించాడు. దాన్ని ఆకట్టుకునేలా, అలరించేలా తెరకెక్కించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమా ఆర్వీ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ప్రారంభంలో చదువు విషయంలో తండ్రి పదే పదే అరుస్తుంటాడు. ప్రేమగా చెప్పడు, దీంతో ఆర్వీ భయపడుతుంటాడు. బిక్కుబిక్కుమనేలా ఉంటాడు.
ఈ క్రమంలో చదువుపై దృష్టిపెట్టలేదు. 90శాతానికిపైగా మార్కులు వచ్చినా అప్పుడే కెరీర్, ఫ్యూచర్ అంటూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. అది ఒక చిన్నపిల్లాడిలోని మానసిక సంఘర్షణని ఆవిష్కరిస్తుంది. అట్నుంచి అమ్మమ్మ ఊరికి వచ్చాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. కేవీ పరిచయంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. కేవీ.. బాల్యంలోని అన్ని రకాల తీపిగుర్తులను ఇస్తాడు. క్రికెట్ ఆడిపిస్తాడు, చెరువులో ఈత కొట్టడం, ఇలా తనకు పాజిబుల్ కానీ కోరికలన్నింటిని కేవీ తీరుస్తాడు. అదే సమయంలో ఫ్యామిలీ బాధలు, బాధలోనూ నవ్వుతూ ఉండాలని చెప్పడం వంటి సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి.
కేవీ వారి ఫ్యామిలీ పరిస్థితులు హృదయాన్ని కదిలిస్తాయి. మరోవైపు మామిడి చెట్లతో కేవీకి ఉన్న అనుబంధం, ఆర్వీ ద్వారా కేవీ నేర్చుకున్న పాఠం, అది మామిడి చెట్లు కాయలు కాయడానికి హెల్ప్ కావడం ఇలా కథ ఎమోషనల్‌గా వెళ్తుంది. కొంత ఫన్, మరికొంత సెన్సిబుల్ అంశాలతో సాగుతుంది. అలరించేలా వెళ్తుంది. క్లైమాక్స్ హృదయాన్ని కదిలిస్తుంది. స్నేహం విలువని తెలియజేస్తుంది. సమ్మర్లో పిల్లలు ఎలాంటి ఆటలు ఆడతారు, అమ్మమ్మ చెప్పే కథలు ఆకట్టుకుంటాయి. అవన్నీ ఆర్వీకి తీపిగుర్తులుగా మిగుల్చుతాయి. కేవీ ఆర్వీలో మార్పు తెస్తే, ఆర్వీకే కేవీలో మార్పు తెస్తాడు. ఇద్దరి స్నేహం బలపడుతుంది. ఇవన్నీ అలరించడంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి.
సమ్మర్ హాలిడేస్ లో ప్లస్, మైనస్‌లు
అయితే సినిమాలో ఫన్ తక్కువగానే ఉంది. ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ జర్నీని, ఆ తీపిగుర్తులను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎమోషనల్ సైడ్, స్నేహానికి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఫన్ యాంగిల్ కూడా పెట్టాల్సింది. అమ్మమ్మతో సీన్లు ఆకట్టుకుంటాయి. కేవీ ఫ్యామిలీ బాధలు, స్ట్రగుల్స్ ని, ఎమోషనల్‌గా చూపించారు. పిల్లల స్నేహం, వారి ఆటలు, ఎంజాయ్ చేయడం వంటి అంశాలు బాగున్నాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. పాటలు, ఆర్ఆర్ కూడా అలరించేలా ఉంది. విజువల్స్ కనువిందు చేస్తాయి. కాకపోతే సినిమా స్లోగా వెళ్తుంది. కామెడీ తగ్గింది. దానిపై ఫోకస్ చేయాల్సింది. మరోవైపు పిల్లలతో కష్టాలు చూపించడం, వాళ్లతో పనిచేయించడం ఎంత వరకు కరెక్ట్ అనేది ప్రశ్న.
ఇలాంటి కథలతోనే పెద్ద హీరోలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో పిల్లలు చేశారు, సమ్మర్ హాలిడేస్ అనేది కొత్త పాయింట్. మామిడి చెట్లని పెంచుకోవడం కొత్తగా ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే రెగ్యూలర్‌గా అనిపిస్తుంది. అమ్మకి చీరకోనివ్వడమే కుర్రాడి లక్ష్యం. అది ఎమోషనల్‌గా ఉన్నా, ఇలాంటి కథలు ఇప్పటికే చాలా చూశాం. కాకపోతే చిన్నప్పటి తీపి గుర్తులను ఇందులో గుర్తు చేయడం విశేషం. మరోవైపు ఎప్పుడూ చదువులే కాదు, ఆటవిడుపు కావాలి, పిల్లలకు ప్రేమగా చెప్పాలనే సందేశం బాగుంది. స్నేహాలు జీవితానికి ముఖ్యమే అని, అవి చాలా మార్పులు తెస్తాయనేది బాగా చెప్పారు. కథ కొత్తగా ఉన్నా, కథనాన్ని కొత్తగా నడపించాల్సింది. కాకపోతే పిల్లలకు బాగా నచ్చుతుంది, పెద్దలకు చిన్ననాటి రోజులను గుర్తు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సమ్మర్ హాలిడేస్‌లో ఎవరు ఎలా చేశారంటే?
ఆర్వీగా మాస్టర్ అరుణ్ దేవ్ చాలా బాగా చేశాడు. ఎమోషనల్ సీన్లని, భయపడే సీన్లలో ఇరగదీశాడు. చిన్న కుర్రాడు అయినా ఎక్స్ ప్రెషన్స్ పరంగా మెప్పించాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. అలాగే కేవీ పాత్రలో మాస్టర్ రోహన్ సైతం ఇరగదీశాడు. అల్లరిగా, బోల్డ్ గా కనిపించే కుర్రాడిగా మెప్పించాడు. అదే సమయంలో కష్టాలు ఫేస్ చేసే అబ్బాయిగా, అమ్మకి చీర కోనిచ్చేందుకు తాను పడే తపన వంటి సీన్లలో అదరగొట్టాడు. వీరిద్దరు యాక్టింగ్‌తో దుమ్మలేపారని చెప్పొచ్చు. వారికి అమ్మ పాత్రలో వాసుకి బాగా చేసి మెప్పించింది.
అలాగే కేవీ అమ్మగా హర్షిణి సైతం అదరగొట్టింది. పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది. ఆమెకి నటిగా మంచి లైఫ్ ఉందని చెప్పొచ్చు. ఇక సీరియస్ ఫాదర్‌గా హర్షవర్థన్ యాప్ట్ గా నిలిచారు. అంతే బాగా చేశారు. అమ్మమ్మగా జయసుధ పాత్రకి బాగా సెట్ అయ్యింది. అదే హుందాతనం, పెద్దరికం, ఒంటరితరం, కుటుంబం కావాలనే కోరికతో ఉన్న అమ్మమ్మగా ఎంతో బాగా చేసి మెప్పించింది. వర్మ పాత్రలో రాజీవ్ కనకాల బాగా చేశాడు. స్కూల్లో కేవీ క్రష్‌గా బేబీ ఖుషి సైతం మెప్పించింది. కాకపోతే ఆమె పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు.
టెక్నీకల్‌గా
సినిమాకి సంగీతం బ్యాక్ బోన్. సింజిత్ యెర్రమల్లి అదరగొట్టాడు. పాటలు అలరించాయి. ఆర్ఆర్ ఇంకా బాగుంది. చాలా సీన్లని ఎలివేట్ చేసింది. ఎమోషనల్ సీన్లను బాగా హైలైట్ చేసింది. సాయి ప్రకాష్ కెమెరా వర్క్ కనువిందుగా ఉంది. విజువల్స్ కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా ఇంకా వర్క్ చేయాలి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ధీరజ్ మొగిలినేని బాగా తీశారు. ఇలాంటి సినిమా తీయాలంటే ప్యాషన్ ఉండాలి, దమ్ము ఉండాలి. ఇక దర్శకుడు శ్రీకర్ నయన్ ఎంచుకున్న కథ, చెప్పాలనుకున్న విషయం బాగుంది. ఇలాంటి కథతో పెద్దగా సినిమాలు రాలేదు. అదే ఈ మూవీ ప్రత్యేకం. పిల్లలకు సంబంధించిన సందేశం బాగుంది. కథనం పరంగా మరింత ఫోకస్ పెట్టాల్సింది. పెద్దగా ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా సాఫీగా సాగడంతో రెగ్యూలర్ ఫీలింగ్ కలుగుతుంది. డ్రామా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది.
ఫైనల్‌గా
కొంత ఫన్, మరికొంత ఎమోషనల్, స్నేహం, చిన్ననాటి తీపిగుర్తులను, మన సమ్మర్ హాలిడేస్, అమ్మమ్మ ఇంటి స్వీట్ మెమోరీస్‌ని మళ్లీ గుర్తు చేసే మూవీ ఇది. కాకపోతే పిల్లలకే ప్రయారిటీ ఇచ్చారు. పెద్దలకు ఎంత వరకు నచ్చుతుందనేది ప్రశ్న. కానీ పిల్లలకు నచ్చే మూవీ అవుతుంది.
రేటింగ్: 3





