Guppedantha Manasu: రిషి ప్రవర్తనకి బాధతో జగతి, మహేంద్ర.. తండ్రి ముందు నిజాన్ని బయటపెట్టేసిన శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. అధికారం కోసం కన్న తండ్రిని కూడా మోసం చేస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నీ మనసుని అర్థం చేసుకున్నాను కాబట్టే నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటేలా ఉంది నువ్వు రావాల్సిందే అంటాడు మహేంద్ర. నా మనసుకి గాయమైన చోటికి రావడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు అంటాడు రిషి. అలా అంటే ఎలా అవుతుంది సార్. మీ కోపం ఇంట్లో వాళ్ళ మీద అయితే కాలేజీ మీద ఎందుకు చూపించడం. కాలేజీ చెయ్యి దాటి పోతుంటే చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతుంది వసుధార.
మా కోసం కాకపోయినా మీ తాతయ్య కోసమైనా ఆలోచించు. ఆయన స్థాపించిన సామ్రాజ్యాన్ని నువ్వు విస్తరించావు. ఇప్పుడు కూడా ఆ కాలేజీని చెయ్యి దాటిపోకుండా నువ్వే కాపాడగలవు ఆ సమర్థత నీకే ఉంది అంటాడు మహేంద్ర. ఆ కాలేజీ తో నాకు సంబంధం లేదు. ఆ కాలేజీ ఎండి గారు అన్నీ చూసుకుంటారు ఆవిడ సమర్ధురాలు. ఆవిడకి సాయం చేయటానికి ఆవిడ శిష్యురాలు ఉంది ఆవిడ కూడా సమర్ధురాలే, కావాలంటే ఆవిడ వస్తుంది లెండి అంటాడు రిషి.
నేను కచ్చితంగా వెళ్తాను సార్, నేను ఆ కాలేజీలో చదువుకున్నాను మిషన్ ఎడ్యుకేషన్ వంటి గొప్ప ప్రాజెక్టులో పని చేశాను. ఇప్పుడు ఆ కాలేజీ కష్టాల్లో ఉందంటే నేను కచ్చితంగా వెళ్తాను వెళ్లి నా రుణం తీర్చుకుంటాను అంటూ మహేంద్ర వాళ్ళని బయలుదేరుదాం పదండి సార్ అంటుంది వసుధార. రిషి మరొకసారి ఆలోచించు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జగతి. అక్కడికి రావటానికి నా మనసు అంగీకరించడం లేదు అని మొండిగా మాట్లాడుతాడు రిషి.
ఇక చేసేదేం లేక వసుధారని తీసుకొని బయలుదేరుతారు మహేంద్ర వాళ్ళు. మరోవైపు ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి త్వరగా సంతకం పెట్టేయండి అని కంగారు పడతాడు ఎమ్మెస్సార్. అది జరిగే పని కాదు,జగతి వాళ్ళు వస్తున్నారు వెయిట్ చెయ్యు, అప్పుడు అవమానంతో వెళ్తావో కాలేజీ నీ పేరు మీద పెట్టుకొని వెళ్తావో చూద్దాం అంటాడు ఫణీంద్ర. కాసేపటి తర్వాత బయట కారిడార్ లో వెయిట్ చేస్తూ ఉన్న శైలేంద్ర, దేవయానికి జగతి వాళ్ళు రావడం కనిపిస్తుంది వాళ్లతో పాటు వసుధార రావటం కూడా చూస్తారు.
ఇంతలో అక్కడికి వచ్చిన ఫణీంద్ర ఎక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. బాబాయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఇప్పుడే సాక్షాలతో సహా తెలిసింది. వాళ్లు రిషి దగ్గరికి వెళ్లారు. ఈ రోజే కాదు వాళ్ళు రిషి దగ్గరికి తరచూ వెళ్తున్నారు అంటూ విష్ కాలేజీలో ఫోటోలు చూపిస్తాడు శైలేంద్ర. నా తమ్ముడు నాకు తెలియకుండా ఇన్ని విషయాలు దాస్తున్నాడా అని అనుకుంటాడు ఫణీంద్ర. ఇంతలో జగతి వాళ్ళు రావడంతో ఎక్కడికి వెళ్లి వచ్చారు అని అడుగుతాడు ఫణీంద్ర.
రిషి దగ్గరికి కదా బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. జగతి వాళ్ళు షాక్ అవుతారు. రిషి ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు, మీరందరూ ఒక్కటైపోయి నన్ను ఒంటరి వాడిని చేశారు అంటూ నిష్టూరంగా మాట్లాడుతాడు ఫణీంద్ర. అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం అంటాడు మహేంద్ర. అదంతా కాదు ముందు ఈ విషయం చెప్పండి ఎందుకు నన్ను చీకట్లోకి నెట్టేశారు, నేను మీ మనిషిని కాదనుకున్నారా అని నిలదీస్తాడు ఫణీంద్ర.
బావగారు.. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. జరిగిందంతా మీకు వివరంగా చెప్తాం కానీ ముందు ఈ ప్రాబ్లం నుంచి బయట పడదాం ముందు ఆ ఎమ్మెస్సార్ ఎక్కడున్నాడో చెప్పండి అంటుంది జగతి. సరే అంటూ ఎమ్మెస్సార్ దగ్గరికి తీసుకు వెళ్తాడు ఫణీంద్ర. అప్పుడు జగతి ఎమ్మెస్సార్ తో ఏంటి మోసం చేసి కాలేజీని కొట్టేయాలనుకుంటున్నావా అది జరగని పని అంటూ కోప్పడుతుంది. నేనేమీ మోసం చేయలేదు శైలేంద్ర అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు కాబట్టే అడుగుతున్నాను అంటాడు ఎమ్మెస్సార్.
చూసుకోకుండా అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావు అంటూ మందలిస్తారు జగతి దంపతులు. ఎమ్మెస్సార్ ముందు నుంచి మోసం చేయాలని చూస్తున్నాడు. అప్పుడు రిషి తెలివైనవాడు తెలివిగా వీడిని తిప్పి కొట్టాడు కానీ శైలేంద్ర అమాయకుడు అందుకే వాడి మోసానికి బలైపోయాడు అని కొడుకుని వెనకేసుకొస్తాడు ఫణీంద్ర.
ఆరోజు నేనే తొందరపడి సంతకం పెట్టేయమన్నాను తప్పంతా నాదే అని గిల్టీగా ఫీల్ అవుతాడు ఫణీంద్ర. వసుధార కూడా ఎమ్మెస్సార్ ని నువ్వు చేస్తున్నది మంచి పని కాదు అంటూ హెచ్చరిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అన్న వెనకే మహేంద్ర కూడా వెళ్తాడు. జరిగిందంతా రిషికి చెప్పటానికి పక్కకి వెళ్తుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.