- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద
Illu Illalu Pillalu Today Episode Dec 12: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమ, ధీరజ్ గొడవ పడుతూ ఉంటారు. రెండు కుటుంబాలను కలపాలన్నదే తన కల అని ప్రేమ చెబుతుంది. అది ఎప్పటికీ జరగదని ధీరజ్ అంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇంకేం జరిగిందో తెలుసుకోండి.

ప్రేమకు వార్నింగ్ ఇచ్చిన ధీరజ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ ప్రేమ, ధీరజ్ గిల్లికజ్జాలతో మొదలవుతుంది. ధీరజ్ పార్కులో తాను ఇచ్చిన పువ్వుని ఏం చేశావని ప్రేమని అడుగుతాడు. ప్రేమ అక్కడే పడేసి వచ్చానని చెబుతుంది. దీంతో ధీరజ్ బాధపడి ప్రేమ ఇచ్చిన పువ్వును ప్రేమ ముఖానే కొడతాడు. ఆ సమయంలో ప్రేమ పుస్తకంలో డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. తనను పట్టించుకోకుండా డ్రాయింగ్ వేస్తున్న ప్రేమ పై అరుస్తాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావని చూస్తాడు. ఆ పుస్తకంలో రెండు కుటుంబాలు, రెండు ఇళ్లు, మధ్యలో ప్రేమ ధీరజ్ బొమ్మలు కనిపిస్తాయి. ఇదేంటని అడుగుతాడు ధీరజ్. దానికి ప్రేమ ఎప్పటికైనా రెండు కుటుంబాలు కలవాలన్నది తన కల అని చెబుతుంది. దానికి ధీరజ్ అది ఎప్పటికీ జరగదని రెండు కుటుంబాలను కలిపే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నిస్తాడు. రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరగడానికి నువ్వు కారణం అవ్వకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
ఇంటికి రాని వల్లి భర్త
ప్రేమ కూడా అంతే కోపంగా తన గదిలోకి వచ్చి పార్కులో ధీరజ్ ఇచ్చిన పువ్వును చాలా జాగ్రత్తగా దాచి ఉంచిన పెట్టెను తెరుస్తుంది. ఆ పువ్వును తీసి ధీరజ్ ముఖాన కొట్టి వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళ మనసులోని ఇష్టాన్ని అర్థం చేసుకోవడం నీకు ఈ జన్మలో రాదు అని తిట్టి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి సీన్ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. భాగ్యం మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటే ఇడ్లీ బాబాయ్ డాన్సులు చేస్తూ వస్తాడు. అదే టైంకి వల్లి ఫోన్ చేస్తుంది. తన భర్త ఇంకా ఇంటికి రాలేదని, సాయంత్రం పార్కులో అమూల్య విశ్వాలను కలిపి చూసేసాడని చెబుతుంది. దీంతో భాగ్యం షాక్ అవుతుంది. ఏం చేయాలో తెలియక ఫోన్ చేసిన వల్లికి లేనిపోని ఐడియాలు ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది భాగ్యం.
అమూల్య, విశ్వ సైగలు
ఈలోపు అమూల్య... టెర్రస్ పై ఉన్న విశ్వతో సైగలతో మాట్లాడుతుంది. విశ్వ సైగలతోనే పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. దానికి అమూల్య తలూపుతుంది. ఇదంతా వల్లి చూస్తుంది. అనవసరంగా వీళ్ళ పెళ్లికి రాయబారం చేస్తానని ఒప్పుకున్నాను, వీళ్ళ పెళ్లి నా చావుకు వచ్చేలా ఉంది అని భయపడుతూ ఉంటుంది. తన భర్త కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గరే ఉంటుంది. మరోపక్క పెద్దోడు బండిపై ఇంటికి వస్తూ విశ్వ, అమూల్యను పార్కులో చూసిన విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వల్లి మాత్రం పెద్దోడు వచ్చాక ఈ విషయాన్ని ఇంట్లో చెబితే పెద్ద పెద్ద గొడవలు అవుతాయని.. నా విషయం కూడా భయపడిపోతూ, చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.
ముసలిదానికి పార్కులెందుకు?
ఇక్కడి నుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి నర్మద, ప్రేమ అక్కడికి వస్తారు. ఇద్దరూ వేదవతిని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. గడసరి అత్తగారు ఎందుకలా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది నర్మద. దానికి వేదవతి చాలా కోపంగా అరుస్తుంది. తనకి చెప్పకుండా భర్తలతో పార్కుకి వెళతారా అని దెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది. మాటవరసకైనా అత్తయ్య పార్కుకి వెళ్దాం రండి అని కనీసం నన్ను పిలవలేదు అని గొడవ పడుతుంది. దానికి నర్మదా మేము మా భర్తలతో అలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము, ముసలోళ్ళని వెంటబెట్టుకుని ఎందుకు వెళ్తాము అని జోక్ చేస్తుంది.
దానికి వేదవతి కోపంగా ‘ఎవరే ముసలిది, నన్ను ముసలిదాన్నంటావా’ అంటూ అరుస్తుంది. దానికి నర్మద మీకు అంత సరదాగా ఉంటే మీ భర్తని తీసుకుని మీరు పార్కు వెళ్ళండి... అంతే కానీ మా మీద పడి ఏడవకండి అంటూ కామెడీ చేస్తుంది. దాంతో ఇప్పుడే మేము బయటికి వెళ్తాము అంటూ వేదవతి బయలుదేరుతుంది.
సినిమాకు ఓకే చెప్పిన రామరాజు
ప్రేమ, నర్మదతో మాట్లాడుతూ అత్తయ్య గారి గురించి తెలిసి కూడా ఎందుకలా రెచ్చగొట్టావ్ అని అడుగుతుంది. దానికి నర్మద ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా ఇలా మాట్లాడితే అప్పుడప్పుడు అలా బయటికి వెళ్లి వస్తారని అన్నానని అంటుంది నర్మద. వేదవతి నేరుగా రామరాజు దగ్గరికి వెళ్లి కోపంగా పదండి మనిద్దరం ఇప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని అంటుంది. దానికి రామరాజు ఇప్పుడు సినిమా ఏంటి అని అడుగుతాడు. మనమేంటి? మన వయసు ఏంటి? ఈ వయసులో సెకండ్ షో సినిమా ఏంటి అంటాడు రామరాజు. ఇదంతా నర్మద, ప్రేమ చూస్తూ నవ్వుకుంటారు. అది చూసి వేదవతికి ఇంకా కోపం వచ్చేస్తుంది. కచ్చితంగా సినిమాకు వెళ్లాల్సిందేనని పట్టుబడుతుంది. వేదవతి ఎంత చెప్పినా వినకపోవడంతో రామరాజు సరే వెళదామని ఒప్పుకుంటాడు. వేదవతి ఆనందంతో పొంగిపోతుంది. ఇక ఇక్కడ ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

