1000 కోట్ల సినిమా కోసం తమిళ హీరోల ఆరాటం... 2026 లో అయినా సాధ్యం అవుతుందా?
టాలీవుడ్ వరుసగా పాన్ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. 1000 కోట్ల సినిమాలను అందిస్తోంది. కానీ కోలీవుడ్ కు 1000 కోట్ల వసూళ్లు ఇంకా అందని ద్రాక్షలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 2026లో ఈ అంచనాలు ఉన్న సినిమాలు ఏమున్నాయోతెలుసా?

1000 కోట్ల సినిమా కోసం ఎదురుచూపులు..
2025 తమిళ సినిమాను, ఆడియన్స్ ను నిరాశపరిచిన సంవత్సరంగానే మిగిలింది. ఎందుకంటే, మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి.. దాదాపు 300 చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ వీటిలో ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్ల రికార్డును అందుకోలేకపోయింది. 2025 లో అత్యధికంగా 'కూలీ' చిత్రం 514 కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల కల నెరవేరలేదు. ఈ కారణంగా అందరి దృష్టి 2026 వైపు మళ్లింది. ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్ల కలతో ఎదురుచూస్తున్న సినిమాల ఎన్నున్నాయో తెలుసా?.
దళపతి విజయ్ చివరి సినిమాపై ఆశలు..
2026వ సంవత్సరం తమిళ సినిమాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే, 2026 జనవరి 9న విజయ్ 'జన నాయగన్' సినిమా థియేటర్లలోకి రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది విజయ్ చివరి సినిమా. ఈ చిత్రాన్ని కేవీఎన్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ వంటి వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విజయ్‌తో కలిసి నటించడంతో, పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వేటకు 'జన నాయగన్' సిద్ధంగా ఉంది. పొంగల్‌కు సుమారు 10 రోజుల వరుస సెలవుల్లో విడుదలవుతుండటంతో ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.
సూర్య రెండు సినిమాలు..
2026లో స్టార్ హీరో సూర్య నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ఒకటి 'కరుప్పు'. ఆ సినిమా జనవరిలో థియేటర్లలోకి వస్తుంది. మరో సినిమా 'సూర్య 46'. ఈ చిత్రాన్ని 'లక్కీ భాస్కర్' సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. ఇందులో సూర్యకు జోడీగా మమితా బైజు నటించింది. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ వంటి సీనియర్ తారలు నటించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 2026 వేసవి సెలవుల్లో విడుదల కానుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీస్తుండటంతో, ఒకవేళ క్లిక్ అయితే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
రజినీకాంత్ జైలర్ 2
2026లో వెయ్యి కోట్ల వసూళ్ల కలతో ఉన్న మరో తమిళ చిత్రం 'జైలర్ 2'. ఇది 2023లో విడుదలైన 'జైలర్' సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రూపొందుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. అంతేకాక, షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో నటిస్తుండటంతో, దీనికి బాలీవుడ్‌లో కూడా క్రేజ్ పెరిగింది. దీంతో ఈ సినిమా సులభంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
తగ్గేది లేదంటున్న కమల్ హాసన్..
తమిళ సినిమాలోని అగ్ర నటుడు కమల్ హాసన్ చివరగా నటించిన 'ఇండియన్ 2', 'థగ్ లైఫ్' రెండు చిత్రాలు ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ఒక హిట్ ఇవ్వాల్సిన ఒత్తిడిలో ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం KH237కి అన్బరివ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కమల్ హాసన్ పర్యవేక్షణలో రూపొందుతోంది. అదిరిపోయే యాక్షన్ కథతో తెరకెక్కబోతున్న ఈి పాన్ ఇండియా సినిమాతో కమల్ మంచి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశతో అభిమానులు ఉన్నారు. అంతే కాదు.. ఈమూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న నమ్మకంతో కూడా ఉన్నారు.
అజిత్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులు
'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం ఘన విజయం తర్వాత నటుడు అజిత్ కుమార్ నటిస్తున్న భారీ చిత్రం ఏకే 64. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. హార్బర్ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ కథతో ఈమూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున, ఇది కూడా వెయ్యి కోట్లు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

