- Home
- Entertainment
- Yash: ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై యష్ ప్రశంసలు.. రాజమౌళినే ధైర్యమిచ్చాడంటూ కామెంట్
Yash: ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై యష్ ప్రశంసలు.. రాజమౌళినే ధైర్యమిచ్చాడంటూ కామెంట్
హీరో యష్.. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. అలాగే రాజమౌళి గొప్పతనం గురించి చెప్పారు. తెలుగు సినిమానే తమకు ధైర్యాన్నిచ్చిందన్నారు.

దీపావళికి రామాయణం రిలీజ్
రాకింగ్ స్టార్ యష్.. `కేజీఎఫ్` సినిమాలతో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఆ మ్యాజిక్ ని `టాక్సిక్`తో రిపీట్ చేయలేకపోయారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన `రామాయణం` మూవీలో నటించారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో యష్ రావణుడిగా నటించారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్ చేశారు. సీతగా సాయిపల్లవి నటించగా, హనుమంతుడిగా సన్నీ డియోల్ చేశారు. నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీపావళి సందర్భంగా నవంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో టీమ్ బిజీగా ఉంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతూ టాలీవుడ్ సినిమాపై, హీరోలపై, దర్శకులపై ప్రశంసలు కురిపించారు.
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల గురించి యష్ కామెంట్
`రెండు నెలల క్రితం మీ అందరినీ కలిశాను. నేను చేసిన వర్క్(టాక్సిక్) గురించి చెప్పాను. మీరందరూ ఎంతో ప్రేమతో సినిమాను చూడడానికి వచ్చారు. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఏదేమైనా, మీరు నాపై ఎంతో ప్రేమతో వచ్చారు. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. రాజమౌళి గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు.. ఇలా అందరూ మన ఇండస్ట్రీ ఎలాంటి అద్భుతాలు చేయగలదో చూపించారు. ఏదైనా చేయగలం అనేదానికి తెలుగు సినిమా ధైర్యాన్నిచ్చింది. రాజమౌళి అది చేసి చూపించారు. వారికి ధన్యవాదాలు. దిల్ రాజు గారితో ఇది నా మూడో కొలాబరేషన్. ఒక మంచి సినిమా తీయాలంటే మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తి దిల్ రాజు గారు. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా ఎంతో కేర్ తీసుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి డైలాగులు ఉండాలనే విషయంలో దగ్గరుండి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆయన సపోర్ట్‌కు ధన్యవాదాలు.
సాయిపల్లవి అమ్మలా కనిపించింది
నితీష్ గారు తన వర్క్‌తోనే మాట్లాడే డైరెక్టర్. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన వల్ల ఈ జర్నీ అంతా చాలా స్మూత్‌గా సాగింది. రకుల్ తెలుగు అమ్మాయి. శూర్పణఖ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. రకుల్ బాగా చేశారు. అలాగే సీతగా సాయి పల్లవి అద్భుతంగా చేశారు. ఆమెని చూస్తుంటే ఒక తల్లిలా అనిపిస్తుంది. రణ్‌బీర్ కపూర్ అద్భుతమైన మనిషి. తనకు ఎలాంటి ఇగో ఉండదు. తను చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో అద్భుతమైన పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. రాముడి పాత్ర కూడా మీ అందరి మనసుల్లో నిలిచిపోతుంది. నమిత్ మల్హోత్రా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో టాప్ లెవెల్‌లో నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఈ విషయం చెప్పినప్పుడు నేను రావణుడి పాత్ర చేస్తానని చెప్పాను. అలాగే ఈ సినిమాను నిర్మిస్తానని కూడా చెప్పాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. సోనీ సంస్థ ఈ సినిమాను గ్లోబల్‌గా రిలీజ్ చేస్తోందంటే, అదంతా అంత ఈజీగా జరగలేదు. నమిత్ గారు దానికోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ప్రేక్షకుడు, అభిమానులు సినిమాపై ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు` అని తెలిపారు యష్.
పెద్దల నుంచి పిల్లల వరకు ఆకట్టుకునే రామాయణం
సాయి పల్లవి మాట్లాడుతూ, `‘రామాయణ’ మూడేళ్ల జర్నీ అయినప్పటికీ, మా డైరెక్టర్, నిర్మాత పదేళ్ల క్రితం నుంచే ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ సినిమా మీకు ఒక ప్రాపర్ తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. నితీష్ గారు ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా, క్లారిటీగా డిజైన్ చేశారు. అలాగే నమిత్ గారి విజన్ చాలా గొప్పది. ప్రతి క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరాలనే గొప్ప ఉద్దేశంతో రూపొందించారు. నేను కూడా రామాయణం చూసి పెరిగాను. ఈ సినిమాలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కనెక్ట్ అవుతారు. రకుల్ గారు శూర్పణఖ పాత్రను అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రణ్‌బీర్ కపూర్ లాంటి గొప్ప యాక్టర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఆయనతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఇది నాకు ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. అలాగే యశ్ గారి విజన్ కూడా ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న యాక్టర్ ఆయన. సీతమ్మ పాత్రను చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక దివ్యత్వం కలగాలి. అదే నా కోరిక. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
శివ మూవీని చూసి షాక్ అయ్యాను- నితేష్ తివారి
డైరెక్టర్ నితేష్ తివారీ మాట్లాడుతూ, `నేను హిందీలో ‘శివ’ సినిమా చూశాను. అప్పటికి నాకు ఆ సినిమా గురించి ఏమీ తెలియదు. ఆ సినిమా చూసి నాగార్జున గారిని, అమల గారిని, వాళ్ల ప్రెజెంటేషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అసలు రాంగోపాల్ వర్మ ఎవరు అని తెలుసుకున్నాను. అలాగే చిరంజీవి ‘ప్రతిబంధ్’ సినిమా కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. నేను దాదాపుగా అన్ని తెలుగు సినిమాలు చూస్తాను. ‘గీతాంజలి’, ‘క్షణక్షణం’ సినిమాలన్నీ తెలుగులోనే చూశాను. అందులోని పాటలు కూడా నాకు తెలుసు. ఆ తర్వాత ‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’ ఇలా అన్ని సినిమాలను హిందీలో చూశాను. నాకు రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్.. ఇలా అందరి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు మా ‘రామాయణ’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా అదే ప్రేమను అందిస్తారని కోరుకుంటున్నాను` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో రణ్‌బీర్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, దిల్ రాజు, కరణ్ జోహార్ వంటి వారు పాల్గొని తమ ఆనందాన్ని తెలిపారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

