Intinti Gruhalakshmi: బసవయ్యకు వార్నింగ్ ఇచ్చిన దివ్య.. కొత్త క్యారెక్టర్ ని రంగంలోకి దింపిన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఒడిదుడుకులలో ఉన్న తన కాపురాన్ని చక్కదిద్దుకుంటున్న ఒక తెలివైన కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో దివ్య మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే అక్కడికి వచ్చిన బసవయ్య, దివ్య గుజ్జు మొత్తం లాగేస్తోంది. టెంక మిగిల్చేలాగా ఉంది కొంచెం నట్టు బోల్టులు బిగించాలి అంటాడు. ఇంతలోనే అటువైపుగా వెళ్తున్న ప్రియని కాస్త కాఫీ ఇమ్మని అడుగుతాడు బసవయ్య. చెయ్యి కాళీ లేదు కాసేపు పోయాక ఇస్తాను అని నిర్లక్ష్యంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. పెద్ద కోడలి ఒంటి బలుపు చిన్న కోడలికి కూడా అంటించినట్లుగా ఉంది.
ఇంట్లో ముసలం పుట్టే లాగా ఉంది అంటాడు బసవయ్య. అంతలోనే అక్కడికి వచ్చిన దివ్య ఏమైంది అంటూ వెటకారంగా ఉంటుంది. రాజ్యలక్ష్మి ఏదో అనేంతలో అక్కడికి విక్రమ్ వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. లాస్య మీద పెట్టుకున్న నమ్మకం వొమ్మైనందుకు అత్తయ్య బాధపడుతున్నారు అంటుంది దివ్య. బాధపడటం ఎందుకమ్మా అంటాడు విక్రమ్. లాస్యని పోలీసులకి పట్టించవలసింది అనవసరంగా వదిలేసాను అని అక్కయ్య బాధపడుతుంది అంటాడు బసవయ్య.
ఇప్పుడు మాత్రం పోయేదేముంది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు ప్రకాష్. మన ఇంటి గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఇకమీదట తనని ఇంటికి రానీయకుండా చూసుకుంటే అంతే చాలు అంటాడు విక్రమ్. ఇంత జరిగాక ఇంకా ఏ మొఖం పెట్టుకొని వస్తుంది అంటాడు బసవయ్య. ఏమో చెప్పలేము కొన్ని మొఖాలకి సిగ్గు ఉండదు అంటూ బసవయ్య దంపతులు వైపు చూసి వెటకారంగా మాట్లాడుతుంది దివ్య. ఇకమీదట మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని దివ్యకి చెప్తాడు విక్రమ్.
మీ అమ్మని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాను. మీరేమీ దిగులు పడకండి అని డబల్ మీనింగ్ లో మాట్లాడుతుంది దివ్య. మరోవైపు ఇంటికి వచ్చిన తులసి సామ్రాట్ చనిపోయిన విషయం అత్తమామలతో చెప్తుంది. హనీ ఒంటరితనాన్ని గురించి అత్తమామలతో చెప్పి బాధపడుతుంది. తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నందు తండ్రి చేతిలో ఉన్న లెటర్ ని తీసుకొని చింపేస్తూ ఉంటాడు. ఎందుకురా చింపేయటం అంటాడు పరంధామయ్య.
నేను, తులసి కలవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఎప్పుడు ఏదో ఒక ఆటంకం పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ జరిగిన ఘోరం నుంచి తులసి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది అంటాడు నందు. అప్పటివరకు వెయిట్ చేయటం కాదు తనని ఆ బాధ నుంచి నువ్వే బయటపడేలాగా చేయాలి అంటాడు పరంధామయ్య. మరోవైపు భోజనాల దగ్గర కూర్చుంటారు విక్రమ్ కుటుంబ సభ్యులందరూ.
ప్రియని కూడా తమతో పాటు భోజనానికి కూర్చో ఉంటుంది దివ్య. కానీ అత్తకి భయపడిన ప్రియ.. వద్దులే అక్క నేను మా ఆయనతో కలిసి భోజనం చేస్తాను అంటుంది. ఇంతలో పనిమనిషి మీ దయవల్ల మా బాబుని చదివించుకోగలుగుతున్నాను అంటూ దివ్య ని మెచ్చుకుంటూ ఆమెకి థాంక్స్ చెప్తుంది. పెద్దవాడిని ఒక సలహా చెప్తాను అంటూ ఇంట్లో పని వాళ్ళని, హాస్పిటల్లో పని వాళ్ళని హాస్పిటల్ లో పని వాళ్ళని చదివించుకుంటూ పోతే ఇంకా మనకి మిగిలేది బొచ్చే అంటాడు బసవయ్య.
ఈ విషయంలో దివ్య మంచిపనే చేసింది. అమ్మ కూడా ఎప్పుడూ నలుగురికి సాయం చేయమనే చెప్పేది అంటూ భార్యని వెనకేసుకొని వస్తాడు విక్రమ్. తన భోజనం అయిపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దివ్య నేను కూడా ఒక సలహా ఇస్తాను వినండి అంటూ.. ఇప్పటికైనా మారితే మంచిది. లేదంటే సెటిల్ చేయవలసిన అకౌంట్లు చాలా ఉన్నాయి, వాళ్ల చీటీలు చించేస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య.
ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది. దీనికి ఒక సవతి పోరు తీసుకు వస్తే తప్ప కుదుటపడేలాగా లేదు అంటాడు బసవయ్య. నువ్వు ఆలోచిస్తున్నావు, ఆల్రెడీ నేను ఆచరణలో పెట్టేసాను అంటుంది రాజ్యలక్ష్మి. ఎవరు ఆ అదృష్టవంతురాలు అంటారు బసవయ్య దంపతులు. ఇంకెవరు నీ కూతురు జాహ్నవి. తనే ఈ పనికి కరెక్ట్ అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు భోజనానికి రమ్మని అనసూయ ఎంత బతిమాలినా భోజనం చేయలేను అంటుంది తులసి. అదే విషయాన్ని కొడుకుతోనూ, భర్తతోను చెప్తుంది అనసూయ.
ప్లేట్లో భోజనం పెట్టు నేను తినిపిస్తాను అంటాడు నందు. నువ్వు తనకి భోజనం తినిపిస్తే జీవితంలో ఎప్పుడైనా మీరిద్దరూ ఒకటవతారనే నమ్మకం నాకు కలుగుతుంది అంటాడు పరంధామయ్య. ఆయన మాటలు ఏమీ పట్టించుకోకు నువ్వు వెళ్ళు అని కొడుకుని భార్య దగ్గరికి పంపిస్తుంది అనసూయ. తరువాయి భాగంలో సామ్రాట్ కజిన్ దంపతులు అమెరికా నుంచి ఎంట్రీ ఇస్తారు. అలాగే రాజ్యలక్ష్మి కుటుంబంలో కూడా జాహ్నవి ఎంట్రీ ఇస్తూనే విక్రమ్ ని అతుక్కుపోతూ ఉంటుంది.