బాక్సాఫీస్ పై దండయాత్ర కు రెడీగా ముగ్గురు మెగా మొనగాళ్లు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈసారి బాక్సాఫీస్‌ను శాసించేందుకు ముగ్గురు మెగా హీరోలు సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురూ భారీ సినిమాలతో రాబోయే నెలల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

ముగ్గరు మెగా మొనగాళ్లు
బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గరు మొనగాళ్లు రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీతో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పోర్డ్స్ డ్రామాతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఈ ముగ్గురు హీరోలు మూడు సినిమాలతో ఎప్పుడెప్పుడు రాబోతున్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి – విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల గ్యాప్ తరువాత విశ్వంభర సినిమాతో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. వరుసగా చిరంజీవిసినిమాలు ప్లాప్ అవుతున్న క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని చిరంజీవి పక్కా ప్లాన్ తో సినిమాలు స్టార్ట్ చేశారు. ఈక్రమంలో ఆయన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఈసినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు చిరంజీవి. అయితే ఈసినిమా రిలీజ్ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఈసారి ఈమూవీని వచ్చే అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమాతో పాటు చిరంజీవి మరో సినిమా కూడా చేస్తున్నారు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాను చిరంజీవి చేస్తున్నారు. ఈసినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఓ భారీ అప్డేట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చిరంజీవి మునుపటి చిత్రం ‘భోళా శంకర్’ నిరాశపరిచిన నేపథ్యంలో, చిరంజీవి ఈసారి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఓజీ
రాజకీయాలతో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఆతరువాత డిప్యూటీ సీఎంగా మరింత బిజీ అయ్యారు. ఈక్రమంలో ఆయన కమిట్ అయిన సినిమాలను రీసెంట్ గా కంప్లీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే హరిహరవీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఇక పవన్ నటించిన ‘ఓజీ’ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనులు జరుగుతున్నాయి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో ఇప్పటికే అంచనాలను భారీగా పెంచింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుండటంతో భారీ హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
రామ్ చరణ్ – పెద్ది
ఇక మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కూడా భారీ ప్రాజెక్ట్ తో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఈ హీరో.. సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. హ్యాట్రీక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసం ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈక్రమంలో సుకుమార్ రాసిన అద్భుతమైన కథతో.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2025 మార్చి 27న విడుదల చేయనున్నారు. ఇలా మెగా హీరోలు బాక్సాఫీస్ పై దండయాత్రకు బయలుదేరారు మరి ఈసారైనా ఈముగ్గురు మెగా హీరోలు హిట్ కొడతారో లేదో చూడాలి.