- Home
- Entertainment
- Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Bigg Boss Agnipariksha 2: బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో ప్రస్తుతం 'కార్డుల' గోల నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌లో ఫైర్ కార్డులు గెలుచుకున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు? అభిజిత్ దగ్గర ఉన్న డేంజర్ కార్డ్ ఏంటి? సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్ హైలెట్స్ ఇవే.

ఉత్కంఠగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్లడానికి సామాన్యులు తహతహలాడుతున్నారు. తమ సత్తా చాటుతూ, టాస్కుల్లో గెలుస్తూ ఫైనల్ రౌండ్‌కు దగ్గరవుతున్నారు. ప్రస్తుతం అగ్నిపరీక్షలో కార్డుల హడావుడి నడుస్తోంది. కంటెస్టెంట్స్‌ను రాబోయే టాస్కుల్లో బలపరచడానికి, సపోర్ట్ చేయడానికి ఈ కార్డులు ఉపయోగపడతాయి. అయితే ఈ కార్డ్స్‌ను టాస్కుల్లో గెలిచి సాధించాల్సి ఉంటుంది.
ఈ కార్డ్ టాస్కులు ఇవ్వడానికి గత సీజన్ల అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ముందుగా డీమాన్ పవన్ ఎంట్రీతో వాతావరణం అంతా మారిపోయింది. వచ్చీ రాగానే అగ్నిపరీక్ష స్టేజ్‌పై రొమాన్స్ మొదలుపెట్టాడు పవన్.
సృష్టితో డీమాన్ పవన్ రొమాంటిక్ డాన్స్
డీమాన్ పవన్ వేదికపైకి రాగానే సృష్టితో కలసి రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది చూసి జడ్జెస్‌తో పాటు అందరూ షాక్ అయ్యారు. వారి డాన్స్ చాలా బాగుందంటూ ప్రశంసలు కూడా దక్కాయి. ఇక టాస్క్ విషయానికి వస్తే.. పవన్, సృష్టిని ఎంచుకున్నాడు. సృష్టితో పాటు కృష్ణ కూడా ఈ టాస్క్‌లో పాల్గొన్నాడు. ఈ టాస్క్‌లో సృష్టి సక్సెస్ అయి 'ఫైర్ కార్డ్' సాధించింది. ఈ కార్డును నలుగురు జ్యూరీ సభ్యులలో ఒకరికి అందించాల్సి ఉండగా, సృష్టి దీనిని నవదీప్‌కు ఇచ్చింది. అనంతరం మరోసారి సృష్టితో డీమాన్ పవన్ డాన్స్ చేసి అలరించాడు.
దివ్య ఎంట్రీ & నామినేషన్ల ప్రభావం
రెండో రౌండ్‌లో మాజీ కంటెస్టెంట్ దివ్య ఎంట్రీ ఇచ్చింది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది తక్కువ రోజులే అయినా గట్టి ప్రభావమే చూపించింది. దివ్య వచ్చీ రాగానే అగ్నిపరీక్ష 2 కంటెస్టెంట్స్‌లో ఫైర్ చూడాలనుకుంది. అందుకే ఎలిమినేషన్ ఎలా చేస్తారో ఒక టాస్క్ రూపంలో చూపించమని అడిగింది.
ఈ టాస్క్ కోసం బాగి, ఝాన్సీ, ప్రియాంక, షాలినిలను సెలెక్ట్ చేసుకున్నారు. షాలిని, ప్రియాంక ఇద్దరూ అపూర్వను టార్గెట్ చేసి నామినేట్ చేయగా.. ఝాన్సీ, హేమంత్‌ను నామినేట్ చేసింది. బాగి మాత్రం గాయత్రిని నామినేట్ చేసింది. ఈ నామినేషన్ల ప్రభావం ఆ తర్వాత జరిగిన టాస్క్‌లపై స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత టాస్క్ కోసం దివ్య.. బాగి, ప్రియాంకలను సెలెక్ట్ చేయగా, వీరిద్దరి మధ్య జరిగిన పోరులో బాగి సక్సెస్ అయి 'ఫైర్ కార్డ్' సాధించింది. ఈ కార్డును ఆమె శ్రీముఖికి ఇచ్చింది.
మూడో ఫైర్ కార్డ్ విజేత ఝాన్సీ
ఇక ముచ్చటగా మూడో ఫైర్ కార్డు కోసం ఝాన్సీ, షాలినిలను సెలెక్ట్ చేశారు. ఈ టాస్క్ కోసం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనలో చాలా మార్పు కనిపించింది. ఇక ఇద్దరు కంటెస్టెంట్లకు జడ్జెస్ నిజమైన అగ్నిపరీక్ష పెట్టారు. మిగిలిన కంటెస్టెంట్లలో ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తే వారికే ఈ ఫైర్ కార్డ్ దక్కుతుంది. అందుకోసం బ్లూ, రెడ్ దారాలను ఇద్దరికీ ఇచ్చి కంటెస్టెంట్ల కాళ్లకు కట్టమన్నారు. ఇష్టం లేనివారు వాటిని విడిపించుకోవచ్చు. ఈ టాస్క్‌లో షాలిని కట్టిన దారాన్ని అపూర్వ, గాయత్రి విప్పేశారు. ఇక్కడ నామినేషన్ల ప్రభావం స్పష్టంగా కనిపించింది. చివరకు సౌమ్యురాలిగా పేరున్న ఝాన్సీ ఈ టాస్క్‌లో గెలిచి 'ఫైర్ కార్డ్' సొంతం చేసుకుంది.
ఎల్లో కార్డ్‌తో అభిజిత్ వార్నింగ్
ఇక కార్డులు అయిపోయాయి అనుకున్న సమయంలో అసలు కార్డును బయటకు తీశాడు అభిజిత్. అదే 'ఎల్లో కార్డ్'. కంటెస్టెంట్ల గుండెల్లో భయం పుట్టించే ఈ కార్డును.. ఎవరైనా సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా, హౌస్‌లో ఉండటానికి అర్హులు కారని అనిపించినా ప్రయోగిస్తారు. ఈ కార్డ్ ప్రయోగిస్తే కంటెస్టెంట్లు 'డేంజర్ జోన్'లో పడతారు. అభిజిత్ ఈ కార్డుతో కంటెస్టెంట్లను హెచ్చరించడానికి ప్రయత్నించాడు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో టాస్కులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. మరి బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎక్కడి వరకు వెళ్తుందో, ఎవరు ప్రధాన హౌస్‌లోకి అడుగుపెడతారో చూడాలి!
