Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం నందమూరి బాలకృష్ణ తన జూబ్లీహిల్స్ నివాసానికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నగదు పరిహారానికి బదులుగా టీడీఆర్ తీసుకునేందుకు నిర్ణయించారు.

ఫ్లైఓవర్ కోసం బాలయ్య ఇంటిని త్యాగం
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో మాస్ హీరోగా అభిమానులను అలరిస్తున్న ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో చేపడుతున్న కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు కోసం తన నివాసానికి చెందిన విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు రూ.1,090 కోట్ల వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ముఫ్ఫఖం జా కాలేజీ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఈ కారిడార్ అనుసంధానం కానుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్ విస్తరణ కూడా ఈ ప్రాజెక్టులో కీలకమైన భాగం.
ఈ నిర్మాణం పూర్తయితే ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనదారులు సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్లేందుకు ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్‌ను కూడా నిర్మిస్తున్నారు.
ఎన్టీఆర్ నిర్మించిన ఇంటితో ప్రత్యేక అనుబంధం
బాలకృష్ణ స్థలం ఇవ్వడానికి అంగీకరించిన విషయం వెనుక మరో ఆసక్తికరమైన అంశం ఉంది. జూబ్లీహిల్స్‌లోని ఈ ఇంటిని నందమూరి తారక రామారావు 1982లో బాలకృష్ణ కోసం నిర్మించారు. దశాబ్దాలుగా ఈ ఇల్లు నందమూరి కుటుంబానికి నివాసంగా ఉండటమే కాకుండా ఎన్నో కుటుంబ వేడుకలకు వేదికగా నిలిచింది. ఎన్టీఆర్ తన అభిమానులను కలుసుకునే ప్రదేశంగానూ ఈ ఇంటికి ప్రత్యేకత ఉంది. ఇంతటి భావోద్వేగ అనుబంధం ఉన్న నివాసంలో కొంత భాగాన్ని ప్రజాప్రయోజనాల కోసం వదులుకోవడానికి బాలకృష్ణ అంగీకరించడం విశేషం.
ల్యాండ్ విలువ రూ.43కోట్లు
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ల్యాండ్ విలువ గజానికి సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ అంచనా ప్రకారం బాలకృష్ణ ఇచ్చేందుకు అంగీకరించిన 862.77 చదరపు గజాల స్థలం విలువ సుమారు రూ.34.5 కోట్ల నుంచి రూ.43.1 కోట్ల వరకు ఉండొచ్చు.
ఈ భూసేకరణలో బాలకృష్ణ నగదు పరిహారాన్ని కోరకుండా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) తీసుకునేందుకు అంగీకరించారు. టీడీఆర్ అనేది భూసేకరణకు బదులుగా భూమి యజమానికి ఇచ్చే అభివృద్ధి హక్కులు. ఈ ప్రాజెక్టులో శబ్దాలయ స్టూడియో 608 చదరపు గజాలు, భవ్య కన్‌స్ట్రక్షన్స్ 341.33 చదరపు గజాల స్థలాన్ని కూడా టీడీఆర్ విధానంలో ఇచ్చేందుకు అంగీకరించాయి.
అయితే, ఈ నిర్మాణ పనుల వల్ల బాలకృష్ణ నివాసంలోని ఒక భవనంలో సగానికి పైగా భాగం ప్రభావితమవుతుందని, దీంతో ఆ భవనాన్ని మార్చాల్సి ఉంటుందని సీఎం ఆఫీస్ వెల్లడించింది. దశాబ్దాల అనుబంధం ఉన్న ఇంటి విషయంలోనూ ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేలా బాలకృష్ణ అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. అభిమానులను ఆనందానికి గురి చేస్తుంది.

