- Home
- Entertainment
- Emmy Awards 2026: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో విజయ్ సేతుపతి... కొడుకుతో కలిసి సందడి
Emmy Awards 2026: ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో విజయ్ సేతుపతి... కొడుకుతో కలిసి సందడి
ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మెరిశారు. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకలో ఆయన స్పెషల్ గెస్ట్‌గా పాల్గొని సందడి చేశారు.

ఎమ్మీ అవార్డ్స్‌లో విజయ్ సేతుపతి
ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, టీవీ షోలు, సిరీస్‌లకు కూడా అంతే పాపులారిటీ ఉంటుంది. వాటిని గుర్తించి ఇచ్చే అంతర్జాతీయ అవార్డులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. టెలివిజన్ రంగంలో ఇచ్చే ఈ ఎమ్మీ అవార్డులను ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాలుగా భావిస్తారు.
1949 నుంచి అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. టీవీ రంగంలో బెస్ట్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్లను గుర్తించి ఈ అవార్డులతో సత్కరిస్తారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకల్లో ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు పాల్గొంటారు.
అవార్డు అందించిన తొలి భారతీయ నటుడు
తాజాగా న్యూయార్క్ నగరంలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఆయన, స్టేజ్ పైకెక్కి ఒక అవార్డును కూడా అందజేశారు.
గతంలో చాలా మంది భారతీయ సినీ ప్రముఖులు ఇంటర్నేషనల్ అవార్డుల ఫంక్షన్స్ కు వెళ్లారు. కానీ ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో విజయ్ సేతుపతి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ స్టేజ్‌పై అవార్డు ప్రజెంట్ చేసిన తొలి ఇండియన్ యాక్టర్‌గా విజయ్ సేతుపతి రికార్డు సృష్టించారు.
కొడుకుతో కలిసి ఈవెంట్‌కు హాజరు
ఈ అవార్డుల వేడుకలో విజయ్ సేతుపతి బ్లాక్ కోట్ సూట్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయనతో పాటు కొడుకు సూర్య విజయ్ సేతుపతి కూడా ఈ వేడుకకు వచ్చాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేలాంటి బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు, తమిళ సినిమాల్లో కేవలం హీరోగానే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ విజయ్ సేతుపతి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రొమాన్స్, కామెడీ, విలనిజం, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించే ఆయన, ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పాపులర్ అవుతున్నారు.
వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఒక సౌత్ ఇండియన్ యాక్టర్, అదీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ లో స్టేజ్ పైకెక్కి అవార్డు ఇవ్వడం అభిమానులకు ఎంతో గర్వకారణంగా మారింది. పైగా తన కొడుకుతో కలిసి ఇంత పెద్ద వేడుకలో పాల్గొనడం అభిమానులకి మరింత సంతోషాన్ని ఇస్తోంది.
ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ ఈవెంట్లో విజయ్ సేతుపతి తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న విజయ్ సేతుపతికి సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.















