- Home
- Entertainment
- Ashish Vidyarthi: 55 ఏళ్లకు విడాకులు, 60 ఏళ్లకు రెండో పెళ్లి.. ట్రోల్స్, విమర్శలపై ఆశిష్ విద్యార్థి ఓపెన్
Ashish Vidyarthi: 55 ఏళ్లకు విడాకులు, 60 ఏళ్లకు రెండో పెళ్లి.. ట్రోల్స్, విమర్శలపై ఆశిష్ విద్యార్థి ఓపెన్
Ashish Vidyarthi: 55 ఏళ్లకు విడాకులు, 60 ఏళ్లకు రెండో పెళ్లి చేసుకోవడంపై నటుడు ఆశిష్ విద్యార్థి మనసు విప్పి మాట్లాడారు. 24 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసిన తర్వాత తను పడిన బాధను పంచుకున్నారు.

రెండో పెళ్లిపై మనసు విప్పిన ఆశిష్ విద్యార్థి
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన నటుడు ఆశిష్ విద్యార్థి. తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించకపోయినా, సోషల్ మీడియా, టీవీల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా 55 ఏళ్ల వయసులో మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం, 60 ఏళ్లకు రెండో పెళ్లి చేసుకోవడంపై ఓపెన్‌గా మాట్లాడారు.
ఆశిష్ విద్యార్థి మొదట నటి, గాయని రాజోషిని పెళ్లి చేసుకున్నారు. వీరికి అర్త్ అనే కుమారుడు ఉన్నాడు. సుమారు 24 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2023లో రూపాలీ బరువాను రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో ఆయన చేసుకున్న ఈ రెండో పెళ్లి అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చే రేపింది.
జీవితం అయిపోయిందనే ఫీలింగ్ కలిగింది- ఆశిష్ విద్యార్థి
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆశిష్ విద్యార్థి తన మొదటి పెళ్లి, విడాకులు, రెండో పెళ్లి గురించి మాట్లాడారు. 24 ఏళ్ల బంధం ముగిసినప్పుడు తనకు ఎదురైన బాధను పంచుకున్నారు. `24 ఏళ్ల బంధం ముగిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. అప్పుడు నా వయసు 55 ఏళ్లు. అన్నీ అయిపోయాయి, జీవితం నాశనమైంది అనిపించింది` అని చెప్పారు.
`ఒక బంధంలో ఇన్నేళ్లు, భావోద్వేగాలు, జీవితాన్ని పెట్టుబడిగా పెట్టిన తర్వాత ఇలాంటి ముగింపు వస్తే దాన్ని అంగీకరించడం సులభం కాదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మా బంధం ముగిసింది. దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ లాభం లేదు. ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ జరిగిపోయింది` అని ఆయన అన్నారు. విడాకుల తర్వాత తనపై వచ్చిన విమర్శల పట్ల కూడా ఆయన బాధపడ్డారు.
అందరూ మాట్లాడటం మొదలుపెడతారు
`నేను ఒక మోటివేషనల్ స్పీకర్‌ని, నటుడ్ని. కానీ జనాలు నా గురించి ఏమేం మాట్లాడారో, దాన్ని నేను ఎలా ఎదుర్కొన్నానో నాకే తెలుసు. నిజాలు తెలియకపోయినా జనాలు చాలా నమ్మకంగా తమ అభిప్రాయాలను చెప్తుంటారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకరో ఇద్దరో కాదు, అందరూ మాట్లాడటం మొదలుపెడతారు` అని ఆయన అన్నారు.
తన రెండో పెళ్లి నిర్ణయాన్ని కూడా కొందరు ప్రశ్నించారని చెప్పారు. `ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? పెళ్లికి బదులు సహజీవనం (లివ్-ఇన్) చేయొచ్చు కదా?" అని కొందరు అడిగారట. మరికొందరు, "నీ సినిమా కెరీర్ ముగిసింది, ఇక ఖాళీగా కూర్చుని పిల్లాడు పెరగడం చూడొచ్చు కదా` అని సలహా ఇచ్చారట. చివరగా ఇలాంటి మాటలు ఆపాలని జనాలకు చెప్పాల్సి వచ్చిందని ఆశిష్ అన్నారు.
జీవితంలో ఎదురయ్యే కష్టాలు, విమర్శల మధ్య కూడా తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తానే తీసుకున్న ఆశిష్ విద్యార్థి ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త జీవితం ప్రారంభించడానికి వయసు ఎప్పుడూ అడ్డుకాదని ఆయన జీవితం చెబుతోంది.













