- Home
- Entertainment
- ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
ANR: సావిత్రి జంటగా ఎన్టీఆర, ఏఎన్నార్ లతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమాలో మాత్రం మహానటితో చేయడానికి ఏఎన్నార్ నో చెప్పాడట. కారణం ఏంటో తెలుసా? ఎన్టీఆర్ ఆ పాత్ర చేయడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఏంటా సినిమా?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక
తెలుగు చలనచిత్ర చరిత్రలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన క్లాసిక్ సినిమా ‘రక్తసంబంధం’. తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి అన్నా చెల్లెలు గా నటించి, ఘనవిజయం సాధించిన ‘పాశమలర్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ అపురూప దృశ్యకావ్యం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది.
తమిళంలో ఆ సినిమా విజయవంతం కావడంతో నిర్మాత డూండీ దాని తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. మొదట ఈ కథను అక్కినేని నాగేశ్వరరావు వద్దకు తీసుకెళ్ళారు. కథ బాగుంది కానీ సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన ఒప్పుకోలేదు. ఈ సినిమా చేయనని చెప్పేశారట. అంతే కాదు ఈ కథతో ఎన్టీఆర్‌ను సంప్రదించమని సలహా కూడా ఇచ్చారట. అప్పటికే అగ్ర హీరోగా ఉన్న నందమూరి తారక రామారావు, కథ నచ్చడంతో ఎలాంటి మొహమాటం లేకుండా సావిత్రి అన్నగా నటించడానికి వెంటనే అంగీకరించారు.సావిత్రితో జంటగా ఆయన నటించిన గుండమ్మ కథ ఆ సమయంలో వీరవిహారం చేస్తోంది. అయినా సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన సంశయించలేదు.
బిజీగా ఉన్నా సరే డేట్లు ఇచ్చిన ఎన్టీఆర్..
అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. అయినా సరే బందిపోటు చిత్రానికి ఇచ్చిన కాల్ షీట్లను రక్తసంబంధం చిత్రానికి సర్దుబాటు చేశారు . విక్టరీ మధుసూదనరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ చేత మాటలు రాయించారు. కొత్త రచయిత కావడంతో ఎన్టీఆర్ మొదట కొంత సందేహించినా, ఆ తర్వాత పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దేవిక నటించగా, కాంతారావు కీలక పాత్ర పోషించారు. సూర్యకాంతం, రేలంగిల హాస్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బడ్జెట్ ఎంత? ఎన్నిరోజులు ఆడింది?
1962 నవంబర్ 1న రక్తసంబంధం విడుదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన గుండమ్మ కథ చిత్రం ఈ సినిమా కంటే నాలుగన్నర నెలల ముందు విడుదలైంది. ఘంటసాల సంగీతం అందించిన పాటలు, ముఖ్యంగా ‘చందురుని మించి అందమొలికించు’ - ‘రక్తసంబంధం’ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం నాలుగు లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 11 కేంద్రాల్లో రక్తసంబంధం చిత్రం 100 రోజులు ఆడింది, తెలుగు టాలీవుడ్‌లో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయి చిత్రంగా నిలిచింది.
