- Home
- Entertainment
- అమితాబ్ స్వయంగా అనౌన్స్ చేసిన చిరంజీవి మూవీ ఎందుకు ఆగిపోయింది.. జీవితాలు నాశనం అంటూ డైరెక్టర్ కామెంట్స్
అమితాబ్ స్వయంగా అనౌన్స్ చేసిన చిరంజీవి మూవీ ఎందుకు ఆగిపోయింది.. జీవితాలు నాశనం అంటూ డైరెక్టర్ కామెంట్స్
అమితాబ్ బచ్చన్ స్వయంగా ఒక సందర్భంలో చిరంజీవి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఆ చిత్రం ఎందుకు పట్టాలెక్కలేదో ఈ కథనంలో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు 150 పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు భావిస్తారు. అయితే చిరంజీవితో సినిమా చేసే అవకాశం అందరికీ దక్కదు. ఇండియా బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ స్వయంగా ఒక సందర్భంలో చిరంజీవి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ మూవీ ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే 150వ చిత్రం విషయంలో ముందుగా చిరంజీవికి వేరే ప్లాన్ ఉండేది. రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమా చేయాలా వద్దా అనే డైలమా కొంతకాలం కొనసాగింది. ఆ టైంలో చిరంజీవి బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన 'బుద్దా హోగే తేరా బాప్' అనే మూవీ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఆ ఈవెంట్ కి రాంగోపాల్ వర్మ కూడా అతిథిగా హాజరయ్యారు. వర్మ వేదికపై మాట్లాడుతూ చిరంజీవి గారు నటించిన సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఆడాయి. అలాంటి చిరంజీవి గారు 149తో తన కెరీర్ ని ఎండ్ చేయడం బాగాలేదు. ఆయన తప్పకుండా 150వ చిత్రంలో నటించాలి అని వర్మ కోరారు. పక్కనే ఉన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ నాకు కూడా 149 మంచి నంబర్ కాదు అని అనిపిస్తోంది. త్వరలో చిరంజీవి గారు 150వ చిత్రంలో నటించాలి అని అడిగారు.
నేను ఈ వేదికపైనే అనౌన్స్ చేస్తున్నా.. చిరంజీవి 150వ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాధ్ అని అన్నారు. దీనితో పూరి జగన్నాధ్ కేరింతలు కొట్టారు. మైక్ తీసుకుని పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారి సినిమాలు చూసి చదువుపై కూడా దృష్టి పెట్టలేదు. డిగ్రీలు దొబ్బాయి.. జీవితాలు నాశనం చేసుకుని ఇండస్ట్రీకి వస్తే.. చిరంజీవి గారు సినిమాలు మానేయడం ఏమీ బాగాలేదు అంటూ పూరి జగన్నాధ్ సరదాగా అన్నారు. చిరంజీవి గారి 150వ చిత్రాన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను అని పూరి జగన్నాధ్ ప్రకటించారు. అక్కడ సరదాగా చిరంజీవి, పూరి జగన్నాధ్ చిత్రాన్ని అమితాబ్ అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత అదే అఫీషియల్ అయింది.
150 వ చిత్రం చేయాలని చిరంజీవి డిసైడ్ అయినప్పుడు దర్శకుడిగా పూరి జగన్నాధ్ ని ఎంచుకున్నారు. వీరి కాంబినేషన్ లో చిత్రానికి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. రాంచరణ్ నిర్మాత. ఆటో జానీ అనే టైటిల్ వినిపించింది. పూరి జగన్నాధ్ చెప్పిన ఫస్ట్ హాఫ్ చిరంజీవికి చాలా బాగా నచ్చేసింది. సెకండ్ హాఫ్ కథ డెవలప్ చేసే క్రమంలో ఇబ్బందులు మొదలయ్యాయి. పూరి వినిపించిన సెకండాఫ్ చిరంజీవికి నచ్చలేదు. దీనితో చిరంజీవి రిస్క్ లేకుండా తమిళ చిత్రం కత్తిని తెలుగులో ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. చిరంజీవి గారికి సెకండ్ హాఫ్ నచ్చకపోయి ఉంటే ఆ విషయం నాకు చెబితే మార్చే వాడిని అని పూరి జగన్నాధ్ బాధపడ్డారు కూడా.

