నటుడు ఉపేంద్రతో లవ్ అంటూ రూమర్స్.. నటి ప్రేమ ఏమన్నారంటే.?
Actress Prema: ప్రముఖ నటి ప్రేమ తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, సహనటులతో అనుభవాలు, ముఖ్యంగా ఉపేంద్ర దర్శకత్వంలో నటించేటప్పుడు ఎదురైన కఠినమైన పరిస్థితుల గురించి వివరించింది.

ప్రేమ సినీ ప్రయాణం..
ప్రముఖ నటి ప్రేమ తన సినీ ప్రయాణం ఎలా మొదలయ్యిందన్న విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 1995లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రేమ.. 23 ఏళ్లుగా తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు ఎంతో కష్టం..
తెలుగు భాష నేర్చుకోవడం తనకు ఎంతో కష్టంగా ఉండేదని, దర్శకుడు కోడి రామకృష్ణ సహకారంతోనే తాను తెలుగులో డైలాగులు చెప్పడం నేర్చుకున్నానని ప్రేమ తెలిపింది. వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు లాంటి అగ్ర హీరోలతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని పేర్కొంది.
ఉపేంద్ర దర్శకత్వంలో..
ఉపేంద్ర దర్శకత్వంలో నటించడం చాలా కష్టమైన సవాలని, సహజ నటన కోసం నిజమైన సన్నివేశాలను చిత్రీకరించేవారని ఆమె గుర్తు చేసుకుంది. ఉపేంద్రతో రిలేషన్, ప్రేమ అనే రూమర్స్ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. అలాగే తన ప్రొఫెషనల్ జర్నీలో సౌందర్యతో ఉన్న స్నేహాన్ని, ఆమెతో గడిపిన క్షణాలను ప్రేమ పంచుకుంది. సౌందర్య మరణం తనను ఎంతగానో కలచివేసిందని, జీవితం, నటన పట్ల తన దృక్పథాన్ని మార్చిందని ఆమె తెలిపింది.
ఆ సినిమాలు చూస్తే..
తాను నటించిన ధర్మ చక్ర, ఓంకారం, పోలీస్ పవర్, దేవి లాంటి చిత్రాలను గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు ఆ సినిమాలు చూస్తుంటే ఇవన్నీ నేనే చేశానా? అని ఆశ్చర్యం కలుగుతుందని ప్రేమ తెలిపింది. నిజానికి తాను హీరోయిన్ కావాలని అనుకోలేదని, ఓం సినిమా తర్వాత పరిశ్రమ నుంచి వైదొలగి, ఎయిర్ హోస్టెస్‌గా మారాలని భావించానని ప్రేమ వెల్లడించింది.
తల్లి ప్రోత్సాహంతోనే..
తన తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చానని, కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఓం భారీ విజయం సాధించడంతో, జీవితంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సవాలుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేని తానూ ఎన్నో కష్టాలు పడ్డానని, తన తండ్రికి కూడా మొదట ఇష్టం లేదని, తర్వాత తన విజయాలను చూసి ప్రోత్సహించారని తెలిపింది.

