తెలీదు.. గుర్తు లేదు.. మర్చిపోయా.. ఐపీఎల్ కాంట్రవర్సీపై జడ్డూ రియాక్షన్ ఇదే..
ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో రిషభ్ పంత్ తో కలిసి సెంచరీ చేశాడు ఆల్ రౌండర్ జడేజా. అయితే ఈ సిరీస్ కు ముందు అతడు ఐపీఎల్ లో..

2022 ఐపీఎల్ కు ఏ ఆటగాడికి ఎన్ని జ్ఞాపకాలను మిగిల్చిందో గానీ టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజాకు మాత్రం అది ఒక మరిచిపోని కాలరాత్రిలా గడిచిపోయిందనడంలో సందేహమే లేదు.
ఈ సీజన్ కు రెండ్రోజుల ముందు అతడిని కెప్టెన్సీగా చేయడం.. తర్వాత వరుస పరాజయాలతో విమర్శలు.. ఒత్తిడి.. అసహనం.. నిరాశ.. నిస్పృహ.. ఇలా అన్నీ అనుభవించాడు జడ్డూ. 8 మ్యాచులకు సారథ్యం వహించిన తర్వాత సడెన్ గా అతడిని సారథిగా తొలగించడం ఒక ఎత్తైతే ఇక చివరి నాలుగు మ్యాచులకు జడ్డూకు గాయమైందన్న కారణంతో అతడికి విశ్రాంతినిచ్చిన ప్రక్రియ మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
ఇక సీఎస్కే చివరి రెండు మ్యాచులకు ముందు అతడు ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో కావడం.. సీఎస్కే ఫాలో అయ్యే సభ్యుల్లో కూడా జడ్డూ పేరు లేకపోవడంతో జడ్డూ-సీఎస్కే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు పొడచూపాయని వార్తలొచ్చాయి. అయితే అదేం లేదని.. జడ్డూ వచ్చే సీజన్ లో కూడా తమకు ఆడతాడని సీఎస్కే యాజమాన్యం ప్రకటన చేసినా ప్రేక్షకులు దానిని అంతగా పట్టించుకోలేదు.
కెప్టెన్సీ భారంతో పాటు వరుస ఓటముల కారణంగా ఈ సీజన్ లో జడ్డూ బ్యాట్, బంతితో విఫలమయ్యాడు. అయితే ఈ ప్రభావం జడ్డూకు జాతీయ జట్టు తరఫున కూడా పడుతుందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన జడ్డూ.. ఐపీఎల్ వైఫల్యం ప్రభావమేమీ తన ఆట మీద పడకుండా ఆడాడు. ఎడ్జబాస్టన్ టెస్టులో 98 పరుగులకే 5 వికెట్లు పడిపోయిన నేపథ్యంలో రిషభ్ పంత్ తో కలిసి ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించాడు. అంతేగాక అతడు కూడా సెంచరీతో కదం తొక్కాడు.
అయితే సెంచరీ తర్వాత రెండో రోజు మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తాను ఐపీఎల్ గురించి మరిచిపోయానని అసలు అందుకు సంబంధించిన విషయాలేవీ తన మైండ్ లో లేవని జడ్డూ చెప్పుకొచ్చాడు.
జడేజా మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఐపీఎల్ లో జరిగిన విషయాలేవీ నా మైండ్ లో లేవు. మీరు ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు దేశం గురించే ఆలోచించాలి. నేను కూడా అదే చేశాను. దేశం తరఫున ఆడుతున్నప్పుడు జట్టుకు అవసరమైన సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేయడం గర్వంగా అనిపిస్తుంది.
ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా నేను చాలా కాన్ఫిడెన్స్ పొందగలిగాను. కీలక సమయంలో సెంచరీ చేయడం ఆనందాన్నిచ్చింది. మా టెయిలెండర్లు కూడా చక్కగా ఆడారు. చివర్లో వచ్చిన 50 పరుగులు మాకు బోనస్ కిందే లెక్క..’అని చెప్పుకొచ్చాడు.