Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీలో ఆడతాడా? లేదా? అనే ప్రశ్నల మధ్య భారత జట్టుతో పాటు క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు.

Virat Kohli
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటకోసం ఎదురుచూసిన క్రికెట్ అభిమానులుక నిరాశే ఎదురైంది. తొలి మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆడలేదు.
టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడకపోవడం విషయాన్ని ప్రస్తావించాడు. కోహ్లీ కుడి మోకాలిలో నొప్పిగా ఉందనీ, అతను ఇప్పటికే ఈ విషయాన్ని తనతో చెప్పాడనీ, ఈ నేపథ్యంలోనే విశ్రాంతి ఇచ్చినట్టు తెలిపాడు. అయితే, కోహ్లీ గాయం సమస్య తీవ్రత ఎంత అనేదానిపై స్పష్టత లేదు.
ఇప్పటికే బుమ్రా దూరం.. కోహ్లీ కూడా దూరం కానున్నాడా?
ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆడనున్న ఏకైక టోర్నీ. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అందుబాటులో ఉండాటా? లేదా అనే విషయం భారత్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి సమయంలో కోహ్లీ గాయం మరింత గందరగోళాన్ని పెంచుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లో ప్రారంభం అవుతుంది. అయితే, భారత్ తన అన్ని మ్యాచ్‌లను ఫిబ్రవరి 20 నుండి దుబాయ్‌లో ఆడనుంది. కోహ్లీ మోకాలి గాయం అంత తీవ్రమైనది కాదనీ, ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆడటానికి అతను సిద్ధంగా ఉంటాడనీ జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కోహ్లీ గాయం కారణంగా క్రికెట్ కు ఆడకపోవడం ఇది ఆరోసారి
భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్‌లో జరుగుతుంది, ఆ తర్వాత సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. కగా, 2017 తర్వాత కోహ్లీ గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా ఉండటం ఇది ఆరోసారి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా విరాట్ కోహ్లీ గాయం గురించి పెద్దగా సమాచారం ఇవ్వలేదు. రోహిత్ శర్మ మ్యాచ్ సందర్భంగా చెప్పినట్టుగానే.. 'కుడి మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ తొలి వన్డేకు అందుబాటులో లేడు' అని బీసీసీఐ పేర్కొంది.
విరాట్ కోహ్లీ కటక్ వెళ్తాడా?
మోకాలి నొప్పి కారణంగా బుధవారం నెట్ సెషన్‌లో కోహ్లీ ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మ్యాచ్ కు ముందు గురువారం షటిల్ స్ప్రింట్ చేయడానికి బయటకు వచ్చినప్పుడు అతని కుడి మోకాలికి బ్యాండేజ్ కనిపించింది. అలాగే, కోహ్లీ సౌకర్యంగా ఉన్నట్టు కనిపించలేదు.
ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ కింగ్ కోహ్లీ కదలికలను గమనిస్తూ ఉన్నారు. గాయం పెద్దది కాకపోవడంతో ఇంకా స్కాన్ తీయలేదని సమాచారం. కోహ్లీ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెకప్ కోసం బెంగళూరుకు వెళ్తాడా లేదా ఇంగ్లాండ్ తో రెండో రి మ్యాచ్ కోసం టీమిండియాతో కలిసి కటక్‌కు వెళ్తాడా అనేది ఆసక్తిని పెంచుతోంది.
మరో రికార్డుకు చేరువైన విరాట్ కోమ్లీ
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్‌లో 14,000 పరుగులకు దగ్గరగా ఉన్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 94 పరుగులు అవసరం. ఇంగ్లాండ్ తో జరిగే తర్వాతి రెండు మ్యాచ్ లలో కోహ్లీ ఆడితే ఈ రికార్డును అందుకోవడం సాధ్యమే. ఏదేమైనప్పటికీ ఇంగ్లాండ్ తో తర్వాత రెండు మ్యాచ్ లలో కోహ్లీ ఆటను చూడాలని క్రికెట్ లవర్స్ ఆశిస్తున్నారు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఆడాలని భారత్ జట్టుతో పాటు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.