- Home
- Sports
- Cricket
- Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Virat Kohli: టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు. ఐసీసీ ర్యాకింగ్స్ విషయంలో క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
- FB
- TW
- Linkdin
Follow Us

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు, వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్లు అధిగమించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. కోహ్లీ టీ20 అత్యధిక రేటింగ్‌ను 897 నుంచి 909కు పెంచుకున్నాడు.
టీ20ల్లో 909 పాయింట్లతో మూడో అత్యధిక స్కోర్ సాధించిన విరాట్ కోహ్లీ
విస్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ ప్రకారం.. విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ అత్యధిక రేటింగ్ ఇప్పుడు 909 పాయింట్లు. ఇది టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో మూడవ అత్యధికం. కోహ్లీ కంటే ముందు ఇంగ్లాండ్‌కు చెందిన డావిడ్ మలాన్ (919 పాయింట్లు), భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (912 పాయింట్లు) మాత్రమే ఉన్నారు.
భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ టీ20ల్లో 125 మ్యాచ్‌లు ఆడి 4188 పరుగులు సాధించాడు. అతని సగటు 48.69. ఒక సెంచరీతో పాటు 25 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 122 పరుగులు నాటౌట్, ఇది 2022 ఆసియా కప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై సాధించాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా ఉన్నాడు.
టెస్టుల్లో 937 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ రికార్డు
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు, ఇది ఒక భారత ఆటగాడికి అత్యధికం.. అలాగే, ఐసీసీ చరిత్రలో 11వ అత్యధిక పాయింట్లు. ఈ ఘనతను 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో సాధించాడు. ఆ పర్యటనలో 10 ఇన్నింగ్స్‌లలో 593 పరుగులు చేయగా, ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో తాను ఒంటరిగా భారత బ్యాటింగ్‌ను నడిపాడు.
ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, 113 టెస్టుల్లో 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 46.85 కాగా, అత్యుత్తమ స్కోరు 254* పరుగులు.
వన్డేల్లోనూ 909 పాయింట్లు సాధించిన విరాట్ కోహ్లీ
వన్డేల్లో కూడా విరాట్ కోహ్లీ అత్యధికంగా 909 రేటింగ్ పాయింట్లను సాధించాడు. ఇది 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో చోటు చేసుకుంది. ఆ సిరీస్‌లో మూడు వన్డేల్లో 191 పరుగులు చేసి, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కోహ్లీ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 302 వన్డేల్లో 14,181 పరుగులు చేశారు. అతని సగటు 57.88 కాగా, 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 183 పరుగులు. కోహ్లీ వన్డేల్లో ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. భారత ప్లేయర్ల లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు.
మూడు ఫార్మాట్లలో 900+ పాయింట్లు సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో 900పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి, ఏకైక ఆటగాడు. ఇదివరకు పలుమార్లు కోహ్లీ ఐసీసీ టెస్టు, వన్డే, టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్ వన్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ మొత్తం 617 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 27,599 పరుగులు చేశాడు. అతని సగటు 52.27 కాగా, ఇందులో 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. భారత్ తరఫున ఇది రెండవ అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డు. మొత్తం క్రికెట్ చరిత్రలో అతను మూడవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు), కుమార సంగక్కార (28,016 పరుగులు) లు మాత్రమే ఉన్నారు.
విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనత భారత క్రికెట్‌కు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్‌కు గర్వకారణంగా చెప్పవచ్చు. మూడు ప్రధాన ఫార్మాట్లలోనూ 900 రేటింగ్ పాయింట్లు సాధించి, తన బ్యాటింగ్ శక్తి ఏంటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చూపించాడు.