- Home
- Sports
- Cricket
- virat kohli: ఆ ఆశ్రమానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అసలేం జరిగిందంటే
virat kohli: ఆ ఆశ్రమానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అసలేం జరిగిందంటే
virat kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ తరచుగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్లి ప్రేమానంద మహారాజ్‌ను కలుస్తుంటారు. అయితే దీనిపై తాజాగా ఓ సంచలన ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రూ.5 కోట్ల చెల్లింపు అంటూ ఆరోపణలు
శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహారి మహారాజ్ అలియాస్ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆశ్రమానికి ప్రజాదరణ పెంచుకునే ఉద్దేశంతో ప్రేమానంద మహారాజ్.. విరాట్ కోహ్లీని అక్కడికి తీసుకురావడానికి రూ.5 కోట్లు చెల్లించారని ఆయన ఆరోపించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
కోహ్లీ ప్రతినిధుల నుంచి ఖండన
ఈ ఆరోపణలపై విరాట్ కోహ్లీ ప్రతినిధి బృందం స్పందించింది. రూ.5 కోట్లు చెల్లించారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కోహ్లీ తన వ్యక్తిగత విశ్వాసం, ప్రేమానంద మహారాజ్‌పై ఉన్న గౌరవంతోనే ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారని తెలిపింది. ఎలాంటి ఆర్థిక లావాదేవీ జరగలేదని పేర్కొంటూ.. ఆధారాలు లేని ఆరోపణలను ప్రచారం చేయడం సరికాదని సూచించింది.
వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని సూచన
కోహ్లీ బృందం మీడియాకు కీలక సూచన చేసింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కథనాలు ప్రచురించే ముందు సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరింది. నిరాధారమైన సమాచారంతో వ్యక్తుల ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. తప్పుడు ప్రచారం కొనసాగితే చట్టపరమైన చర్యలపై కూడా ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
2023 నుంచి బృందావన్ పర్యటనలు
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు బృందావన్‌లోని ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడం కొత్త విషయం కాదు. 2023 జనవరిలో తమ కుమార్తె వామికతో కలిసి తొలిసారి అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించారు. కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సమయంలో కూడా ప్రేమానంద మహారాజ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
Virat Kohli has responded to the allegations that he took ₹5 crores to visit Premanand Ashram in Mathura, UP. https://t.co/mJ6gr66fg4
— Piyush Rai (@Benarasiyaa) October 7, 2026
భక్తి, జీవితంపై ప్రేమానంద మహారాజ్ సూచనలు
ఆశ్రమంలో కోహ్లీ దంపతులకు ప్రేమానంద మహారాజ్ ఆధ్యాత్మిక విషయాలపై మార్గనిర్దేశం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాము చేసే వృత్తిపరమైన పనులను భగవంతుడికి సేవగా భావించాలని, జీవితంలో వినయం కొనసాగించాలని ఆయన సూచించినట్లు సమాచారం. అందుకే తమ విశ్వాసంలో భాగంగానే కోహ్లీ దంపతులు ఆశ్రమానికి వెళ్తున్నారని ఆయన ప్రతినిధులు చెబుతున్నారు.

