- Home
- Sports
- Cricket
- టెస్టు క్రికెట్ అంటే ఇది కాదు.. అతడిని చూసి నేర్చుకో.. రిషభ్ పంత్ పై గౌతం గంభీర్ ఆగ్రహం
టెస్టు క్రికెట్ అంటే ఇది కాదు.. అతడిని చూసి నేర్చుకో.. రిషభ్ పంత్ పై గౌతం గంభీర్ ఆగ్రహం
Gautham Gambhir Criticizes Rishabh Pant: రిషభ్ పంత్ ఆటతీరు పై భారత సీనియర్ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఆపదలో ఉన్నప్పుడు చెత్త షాట్ ఆడి వికెట్ కోల్పోవడంపై వాళ్లు.. పంత్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటతీరు, వ్యవహార శైలిపై భారత మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో చెత్త షాట్ సెలెక్షన్ తో ఔటవడమే గాక దక్షిణాఫ్రికా ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడంపై విమర్శల వర్షం కురుస్తున్నది.
వాండరర్స్ టెస్టులో భాగంగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్ అనవసర షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న క్రమంలో బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి ఇలా నిర్లక్ష్యంగా ఔటవడంపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా పంత్ పై విమర్శలు గుప్పించాడు.
అంతేగాక.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాడు డసెన్ ను పంత్ స్లెడ్జింగ్ చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డసెన్ ను పంత్.. ‘నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ ఆలోచన లేదు..’ అని కవ్విస్తూ కనిపించాడు. ఇదే విషయమై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తీవ్రంగా స్పందించాడు.
గంభీర్ స్పందిస్తూ.. ‘ఎవరినౌనా స్లెడ్జింగ్ చేయడం సులువే. కానీ అదే సమయంలో నువ్వు (పంత్ ను ఉద్దేశిస్తూ) క్రీజులో ఉన్నప్పుడు బాగా బ్యాటింగ్ చేయడం అనేది చాలా కఠినమైన అంశం.
రెండో ఇన్నింగ్సులో బ్యాటింగ్ కు వచ్చిన రిషభ్ పంత్ పోరాడతాడని నేను అనుకున్నాను. కానీ అతడు అలా చేయలేదు. ఓ చెత్త షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు.
దీనికి నిరాశ అనే పదం చాలా చిన్నది. టెస్టు క్రికెట్ ఆడాల్సింది ఇలా కాదు. టెస్టులు ఎలా ఆడాలో నీ ప్రత్యర్థి జట్టు సారథి డీన్ ఎల్గర్ ను చూసి నేర్చుకో. నీకే కాదు.. టీమిండియాకు చెందిన యువ ఆటగాళ్లందరికీ నేను చెప్పే సలహా ఒక్కటే.
మీరు నిజంగా టెస్టు క్రికెట్ లో నిలకడగా రాణించాలంటే ఎల్గర్ ను చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కునేప్పుడు వాళ్లు ఊరికే పరుగులు ఇవ్వరని మీరు గమనించాలి. బౌలర్లను గౌరవిస్తూనే వారిపై దాడికి దిగాలి...’ అని పంత్ కు హితబోధ చేశాడు గంభీర్.
ఇక పంత్ ఔటైన విధానంపై నిన్న గవాస్కర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ.. ‘అప్పటికే భారత్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఆ టైమ్ లో క్రీజులోకి వచ్చిన పంత్ కాస్తైనా బాధ్యతగా ఆడాలి కదా.. కానీ ఓ చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.
ఇది క్షమార్హం కాదు.. రహానే, పుజారా వంటి సీనియర్లు ఎంత చక్కగా ఆడారు. నువ్వు కూడా అదే విధంగా పోరాడి ఉంటే భావుండేది. పంత్ చెత్త ప్రదర్శనపై చెప్పేందుకు మాటలు రావడం లేదు...’ అని సన్నీ అన్నాడు.