39 ఏళ్ల భారత ఆటగాడు హఠాన్మరణం.. షాక్‌లో క్రికెట్ ప్రపంచం
cricket: 39 ఏళ్ల భారత క్రికెటర్ హఠాన్మరణం చెందాడు. ఈ విషాద వార్త క్రికెట్ ప్రపంచాన్నిషాక్ కు గురిచేసింది.
Cricket
Team India: బెంగాల్‌లో క్రికెటర్ మృతి చెందాడు. ఈ విషాద వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎందుకుంటే 39 ఏళ్ల ఆ క్రికెటర్ హఠాన్మరణం చెందాడు. బెంగాల్ రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడు సువోజిత్ బెనర్జీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల బెంగాల్ మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ హజారే ట్రోఫీలో సువోజిత్ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
రంజీ ట్రోఫీలో ఆడిన సువోజిత్ బెనర్జీ
సువోజిత్ బెనర్జీ బెంగాల్ తరపున 2014 విజయ్ హజారే ట్రోఫీలో ఒడిషాపై అరంగేట్రం చేశాడు. మూడు రంజీ ట్రోఫీ గేమ్‌లలో కూడా ఆడాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెనర్జీ షోలాపూర్‌లోని తన ఇంట్లో ఉదయం అల్పాహారం తిన్న తర్వాత నిద్రపోతున్నారు. కొన్ని గంటల తర్వాత 39 ఏళ్ల ఆటగాడు తన తల్లిదండ్రుల పిలిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురై వెంటనే వైద్యులను పిలిపించారు. అయితే, అప్పటికే సువోజిత్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
లక్ష్మీ రతన్ శుక్లా ఏం చెప్పారు?
సువోజిత్ బెనర్జీ ఇప్పటికీ స్థానిక క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. లక్ష్మీ రతన్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ అతను ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడనీ, అతనొక గొప్ప సహచరుడని కొనియాడాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిందనీ, బెంగాల్ జట్టులో అతని ఎంపిక ఊహించినట్లుగానే జరిగిందని తెలిపాడు.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ సువోజిత్
సువోజిత్ బెనర్జీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అలాగే, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా. 2008-09 నుండి 2016-17 వరకు దేశవాళీ క్రికెట్‌లో ఈస్ట్ బెంగాల్ తరపున ఆడాడు. అతను రెండుసార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లను ఆడాడు. అతని మరణం బెంగాల్ క్రికెట్‌తో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది.