- Home
- Sports
- Cricket
- అబ్బే అది చాలా చిన్నది.. మా ఆలోచన చాలా పెద్దది.. ఇండియా-పాక్ సిరీస్ పై జై షా కీలక ప్రకటన
అబ్బే అది చాలా చిన్నది.. మా ఆలోచన చాలా పెద్దది.. ఇండియా-పాక్ సిరీస్ పై జై షా కీలక ప్రకటన
BCCI vs PCB: రెండేండ్లకో, మూడేండ్లకో భారత్-పాక్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ అంటే వేయి కండ్లతో ఎదురుచూసే క్రికెట్ అభిమానులు.. ద్వైపాక్షిక సిరీస్ ల కోసం కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. కానీ..

దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ పోరును వీక్షించాలనుకుంటున్న వారి ఆశలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా నీళ్లు చల్లాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ ఇరు దేశాల మధ్య ఏదైనా ఐసీసీ ఈవెంట్లలో తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవని తేలింది.
గతంలో పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ప్రతిపాదించిన ద్వైపాక్షిక సిరీస్ తో పాటు నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ పై కూడా జై షా తేల్చేశాడు. అవి స్వల్పకాలిక వాణిజ్య టోర్నీలని, వాటివల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పాడు.
గత నెలలో రమీజ్ రాజా ఐసీసీ ముందు ఓ ప్రతిపాదనను ఉంచనున్నామని వ్యాఖ్యానిస్తూ.. ఈ నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ విషయాన్ని తెరపైకి తెచ్చాడు. టీ20 ప్రపంచకప్-2021 లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచుకు వచ్చిన క్రేజ్, ఆ మ్యాచుకు వచ్చిన టీఆర్పీలు, వ్యూయర్షిప్ చూసిన తర్వాత పీసీబీకి ఓ ఆలోచన వచ్చింది.
ఇండియా-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడని పక్షంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లతో పాటుగా ఇండియా, పాకిస్థాన్ లతో కలిసి తటస్థ వేదికలపై నాలుగుదేశాల టీ20 సిరీస్ ను నిర్వహిస్తే బావుంటందని పీసీబీ ఓ ప్రతిపాదనను తెచ్చింది.
దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని నాలుగు దేశాలు సమానంగా పంచుకోవాలని.. ఆ దిశగా ఐసీసీ ప్రయత్నం చేయాలని అందులో పేర్కొది.
ఇప్పుడు ఇదే ప్రతిపాదనపై జై షా మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించింది. అంతేగాక ఐపీఎల్ ను విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఐసీసీ ఈవెంట్లకు తగిన ప్రాధాన్యమిస్తూనే.. స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లు, టెస్టు క్రికెట్ ను కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత..
రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో స్వల్పకాలిక వాణిజ్య టోర్నీ (రమీజ్ రాజా ప్రతిపాదించిన నాలుగు దేశాల టోర్నీ) ల కంటే మాకు అదే ముఖ్యం..’ అని అన్నాడు.
రెండు క్రికెట్ బోర్డుల స్పందన ఎలా ఉన్నా ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ ఏంటో తాజాగా మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు.. పాకిస్థాన్ తో తలపడనున్న విషయం తెలిసిందే.
అక్టోబర్ 23న జరిగే ఈ మ్యాచ్ కోసం ఆన్లైన్ లో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించిన ఐసీసీ.. నిమిషాల వ్యవధిలోనే హౌజ్ ఫుల్ బోర్డు పెట్టేసింది. దీనిని బట్టి ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం గమనించవచ్చు. 2013 తర్వాత ఈ రెండు దేశాలు ఐసీసీ ఈవెంట్లలో తప్ప ముఖాముఖి తలపడలేదు.