- Home
- Sports
- Cricket
- Ind Vs SA: వాళ్లిద్దరూ క్రీజులో ఉంటే మాకు తలనొప్పి : టీమిండియా ఆటగాళ్లపై సౌతాఫ్రికా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
Ind Vs SA: వాళ్లిద్దరూ క్రీజులో ఉంటే మాకు తలనొప్పి : టీమిండియా ఆటగాళ్లపై సౌతాఫ్రికా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
Pujara And Kohli: టీమిండియా వెటరన్ బ్యాటర్లు కోహ్లి-పుజారాలు క్రీజులో ఉంటే కేప్టౌన్ టెస్టులో తాము ఆశలు వదులుకోవాల్సిందేనని దక్షిణాఫ్రికా బ్యాటర్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరినీ...

కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత జట్టు 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాను 210 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం అందించారు.
ఇక రెండో రోజు ఆఖరి సెషన్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వికెట్లను కోల్పోయింది. కానీ ఛతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి లు మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు.
ఇప్పుడు వీళ్లిద్దరు ఎలా నిలదొక్కుకుంటారనేదానిపైనే ఈ టెస్టులో భారత విజయం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రెండో రోజు మ్యాచ్ అనంతరం పీటర్సన్ మాట్లాడుతూ.. ‘పుజారా- కోహ్లిల జోడీ క్రీజులో ఉంటే అది మాకు తలనొప్పి. గత కొన్ని ఇన్నింగ్సుల నుంచి ఈ ఇద్దరూ మా జట్టుకు ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు.
రేపు (గురువారం) ఉదయం సెషన్ లో వాళ్లిద్దరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఈ టెస్టుపై మేము అంత పట్టు సాధిస్తాం.. ’ అని పీటర్సన్ అన్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు త్వరగా నిష్క్రమించినా పుజారా (43), కోహ్లి (79) లు రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా ఓపెనర్లు తక్కువ స్కోరుకే నిష్క్రమించినా.. పుజారా (9 బ్యాటింగ్ ), కోహ్లి (14 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు.
ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో పీటర్సన్ (72) టాప్ స్కోరర్. ఈ సిరీస్ లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ. తన ఇన్నింగ్స్ పై పీటర్సన్ స్పందిస్తూ... ‘రెండు ఇన్నింగ్సులలో హాఫ్ సెంచరీలు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాను. కానీ త్వరలోనే శతకం సాధిస్తాను..’ అని అన్నాడు.
భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం అంత సాధారణ విషయమేమీ కాదన్న పీటర్సన్.. తన కెరీర్ లోనే అత్యంత కఠినమైన సవాల్ ను ఎదుర్కుంటున్నానని అన్నాడు. భారత బౌలర్లు తమను స్కోర్లు చేయకుండా నిలువరిస్తున్నారని చెప్పాడు.