అరుదైన రికార్డుల మీద కన్నేసిన సూర్య, భువీ.. కివీస్ తో సిరీస్ లో సాధ్యమేనా..!
INDvsNZ: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తో పాటు వెటరన్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇద్దరూ ఈ న్యూజిలాండ్ సిరీస్ లో ఈ ఫీట్ సాధిస్తే కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అతడు.. నేటి నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్ లో గనక టీ20 ప్రపంచకప్ ఫామ్ ను కొనసాగిస్తే చరిత్ర సృష్టించడం ఖాయం.
సూర్య ఇప్పటివరకు టీ20లలో 40 మ్యాచ్ లు ఆడి 1,284 రన్స్ చేశాడు. ఇందులో ఈ ఏడాది 29 మ్యాచ్ లలోనే 1,040 పరుగులు చేయడం గమనార్హం. 41.41 సగటు, 179.07 సగటుతో సూర్య దుమ్ముదులుపుతున్నాడు.
ఈ ఏడాది వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న (టీ20లలో) సూర్య.. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తర్వాత క్యాలెండర్ఈయర్ లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. ఇక కివీస్ తో సిరీస్ లో గనక సూర్య 287 పరుగులు చేయగలిగితే అతడు రిజ్వాన్ అత్యధిక పరుగుల రికార్డును కూడా బద్దలుకొడతాడు.
2021లో రిజ్వాన్.. 29 మ్యాచ్ లలో 1,326 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఈయర్ లో ఇన్ని పరుగులు చేయడం టీ20లో ఇప్పటివరకూ ఇదే రికార్డు. ఇక సూర్య ఈ ఏడాది 1040 రన్స్ సాధించాడు.
కివీస్ తో సిరీస్ లో మూడు మ్యాచ్ లలో సూర్య 287పరుగులు చేస్తే రిజ్వాన్ రికార్డు బద్దలవడం ఖాయం. టీ20 ప్రపంచకప్ లో అత్యద్భుత ఫామ్ ను కొనసాగించిన సూర్యకు కివీస్ తో సిరీస్ లోనూ అదే ఆట ఆడితే ఇదేమంత పెద్ద కష్టమైన పనేమీ కాదు.
ఇక భువీ విషయానికొస్తే.. ఈ ఏడాది భువనేశ్వర్ టీ20లలో ఇప్పటివరకు ఈ వెటరన్ పేసర్ 30 మ్యాచ్ లలో 36వికెట్లు తీశాడు. ఈజాబితాలో ఐర్లాండ్ కు చెందిన జెబి లిటిల్.. 26 మ్యాచ్ లలో 39వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వత నేపాల్ కు చెందిన లమిచనె..18 మ్యాచ్ లలో 38 వికెట్లు, శ్రీలంక బౌలర్ డిసిల్వ (20 మ్యాచ్ లలో 36వికెట్లు), షంషీ (దక్షిణాఫ్రికా) 22 మ్యాచ్ లలో 36 వికెట్లు భువీకంటే ముందున్నారు.