- Home
- Sports
- Cricket
- ఐర్లాండ్ టూర్ కు అతడికి ఛాన్సిస్తే బాగుండేది : తెవాటియాపై దిగ్గజ క్రికెటర్ కామెంట్స్
ఐర్లాండ్ టూర్ కు అతడికి ఛాన్సిస్తే బాగుండేది : తెవాటియాపై దిగ్గజ క్రికెటర్ కామెంట్స్
India Tour Of Ireland: ఈనెల 26, 28న భారత జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20లు ఆడనుంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే బీసీసీఐ 17 మందితో కూడిన సభ్యుల జాబితాను ప్రకటించింది.

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వచ్చే నెల 1నుంచి ఇంగ్లాండ్ తో గతేడాది మిగిలిపోయిన ఐదో టెస్టును ఆడనుండగా.. రెండో భారత జట్టు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఐర్లాండ్ తో రెండు టీ20లు ఆడనుంది. ఈనెల 26, 28న ఐర్లాండ్ తో భారత జట్టు రెండు టీ20లు ఆడుతుంది.
ఈ మేరకు 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జట్టులో చోటు ఆశించిన పలువురు యువ ఆటగాళ్లకు రిక్తహస్తాలే మిగిలాయి. ఆ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రాహుల్ తెవాటియా.
అయితే ఐర్లాండ్ టూర్ కు తెవాటియాను తీసుకుంటే బాగుండేదని అంటున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఐపీఎల్ లో నిలకడగా రాణించిన అతడిని ఇంకెన్ని రోజులు పక్కనబెడతారు..? అని ప్రశ్నించాడు.
సన్నీ మాట్లాడుతూ.. ‘రాహుల్ తెవాటియాను ఐర్లాండ్ టూర్ కు తీసుకుంటే బాగుండేది. అటువంటి ఆటగాడిని వదులుకోవడం చాలా కష్టం. గత కొన్నాళ్లుగా ఐపీఎల్ తో పాటు దేశవాళీలో కూడా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.
గ్రౌండ్ మొత్తం షాట్లు ఆడగల సత్తా అతడిలో ఉంది. ఒంటిచేత్తో మ్యాచులను గెలిపించగల ఆటగాడు తెవాటియా. చివర్లో వచ్చినా తనదైన మార్కును చూపిస్తాడు.
Image credit: PTI
తెవాటియాను ఐర్లాండ్ టూర్ కు 18వ ఆటగాడిగా ఎంపిక చేస్తే బాగుండేది. అలాంటప్పుడు అతడి ఆటకు గుర్తింపు దక్కిన ఫీలింగ్ అయినా అతడికి దక్కేది. తుది జట్టులో ఆడే అవకాశం కల్పించకపోయినా జట్టులోకి ఎంపిక చేసినా ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెలక్టర్లు మనను గుర్తించారనే నమ్మకం వాళ్లలో కలుగుతుంది..’ అని అన్నాడు.
కాగా ఈ సిరీస్ కు భారత జట్టులో రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కాయి. వీళ్లంతా ఐపీఎల్ లో అదరగొట్టిన వారే కావడం గమనార్హం.
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన తెవాటియా.. 12 ఇన్నింగ్స్ లలో 217 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివర్లో ఫినిషర్ గా గుజరాత్ కు పలు మ్యాచులలో విజయాలు అందించాడు తెవాటియా. గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో అతడు భారత జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం రాలేదు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్