- Home
- Sports
- Cricket
- IND vs SL: భారత్ తో టెస్టులకు జట్టును ప్రకటించిన లంక.. కీలక ఆల్ రౌండర్ లేకుండానే బరిలోకి..
IND vs SL: భారత్ తో టెస్టులకు జట్టును ప్రకటించిన లంక.. కీలక ఆల్ రౌండర్ లేకుండానే బరిలోకి..
Srilanka Squad For Tests Series: ఐదేండ్ల తర్వాత భారత్ లో టెస్టులు ఆడటానికి వచ్చిన శ్రీలంక.. ఈ మేరకు జట్టును ప్రకటించింది. 18 మందితో కూడిన ఈ జట్టులో..

టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతున్న శ్రీలంక.. త్వరలో జరుగబోయే టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఐదేండ్ల తర్వాత భారత్ లో టెస్టు ఆడుతున్న లంక జట్టుకు దిముత్ కరుణరత్నే సారథ్యం వహించనున్నాడు. 2017 తర్వాత లంక జట్టు భారత్ తో భారత్ లో టెస్టులు ఆడలేదు.
రెండో టీ20 మ్యాచుకు ముందు లంక క్రికెట్ బోర్డు.. టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఇటీవల బంగ్లాదేశ్, వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లలో మెరుగైన ప్రదర్శనలు చేసి సిరీస్ లు నెగ్గిన లంక.. ఆ విజయాలను టీమిండియాతో పై కొనసాగించాలని ఆశిస్తున్నది.
అయితే కరుణరత్నే సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో కీలక ఆల్ రౌండర్ వనిందు హసరంగ లేకుండానే లంక బరిలోకి దిగుతుంది. ఆస్ట్రేలియాతో పర్యటన సందర్భంగా హసరంగ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.
భారత్ తో టీ20లకు అతడు కీ ప్లేయర్ గా మారుతాడిన భావించినా.. ఇటీవల అతడికి చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులలో కూడా హసరంగకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో టీ20 సిరీస్ కు దూరమైన అతడు.. తాజాగా టెస్టు జట్టులో కూడా చోటు దక్కించుకోలేదు.
అయితే లంక సీనియర్ ఆటగాడు సురంగ లక్మల్ మాత్రం జట్టులో చోటు దక్కింది. 34 ఏండ్ల లక్మల్ కు ఇదే ఆఖరు టెస్టు సిరీస్. కెరీర్ లో 68 టెస్టులాడిన లక్మల్.. 168 వికెట్లు పడగొట్టాడు.
లక్మల్ తో పాటు సీనియర్ ఆటగాడు ఏంజెలొ మాథ్యూస్ కూడా లంక టెస్టు జట్టులో చోటు సాధించాడు. బ్యాటర్లు, బౌలర్లతో పాటు ఆల్ రౌండర్లతో నిండిన లంక.. స్వదేశంలో భారత్ ను ఏమేర నిలువరిస్తుందో చూడాలి.
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా లంక.. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుతో మార్చి 4 నుంచి 8 వరకు మొహాలీ వేదికగా తొలి టెస్టు ఆడనున్నది. రెండో టెస్టు బెంగళూరు వేదికగా.. మార్చి 12 నుంచి మొదలుకావాల్సి ఉంది.
భారత్ తో టెస్టులకు శ్రీలంక జట్టు : దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పథుమ్ నిస్సంక, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వ, కుశాల్ మెండిస్ (ఇంకా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది), ఏంజెలొ మాథ్యూస్, దినేశ్ చండిమాల్, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్ల, చమిక కరుణరత్నే, రమేశ్ మెండిస్, లాహిరు కుమార, సురంగ లక్మల్, దుష్మం చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వండర్సె, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డెనియ