Indian cricket: భారత్ తరఫున రోహిత్, విరాట్ టీ20లు ఆడకపోవడమేంటీ.. స్టార్ బ్యాటర్స్ పై ఆకాశ్ చోప్రా కామెంట్స్
Rohit Sharma-Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20, వన్డే సిరీస్ లకు భారత స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దూరం కానున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత తమ ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు.
BCCI: టీ20ల్లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించడం ఇష్టం లేదనీ, దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్లలో ఒకరైన ఆకాశ్ చోప్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కు దూరమవడంతో హార్దిక్ స్థానంలో రోహిత్ ను తీసుకోవాలని బీసీసీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రోహిత్ విముఖత చూపుతున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
దీనిపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ఏ ఫార్మాట్ లోనూ భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించేందుకు రోహిత్ ఎప్పుడూ నిరాకరించలేదనీ, పొట్టి ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం మిస్టరీగా ఉందని అన్నాడు.
సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. 'భారత్ ను ఏ ఫార్మాట్లోనూ నడిపించకూడదనే కోరికను రోహిత్ ఎప్పుడూ వ్యక్తం చేయలేదని నేను అనుకోవడం లేదు. దీనిని సరిదిద్దుకున్నందుకు సంతోషంగా ఉంది... అతను ఎప్పుడూ నో చెప్పనిదానికి అతన్ని ఒప్పించాల్సిన అవసరం ఏమిటి? నిజానికి గత టీ20 ప్రపంచకప్ నుంచి... భారత్ ఆడిన ఏ టీ20లోనూ రోహిత్-విరాట్ ఎందుకు పాల్గొనలేదో ఎవరూ ప్రస్తావించలేదు. అదో మిస్టరీ... ఎవరూ ఛేదించడానికి ప్రయత్నించలేదు" అని పేర్కొన్నాడు.
rohit sharma and virat kohli
వైట్ బాల్ పోటీలకు, ప్రొటీస్ కు తాను అందుబాటులో లేనట్లు విరాట్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం.