Champions Trophy: టీమిండియా విజయానికి వారే కారణం.. పాంటింగ్ కామెంట్స్ వైరల్
Champions Trophy: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపులో వెన్నెముకగా నిలిచిందని ఆసీస్ లెజెండరీ ప్లేయర్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.

Rohit Sharma, Virat Kohli: ఫైనల్లో రోహిత్ శర్మ సేన న్యూజిలాండ్‌ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఒక్క ఓటమి లేకుండా అజేయంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముగించింది. మూడో సారి భారత్ ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చి చేరింది. భారత జట్టు విజయంపై మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు జల్లు కురుస్తోంది.
ఈ క్రమంలోనే ఆసీస్ లెజెండరీ ప్లేయర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత జట్టు విజయంపై స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలవడంలో కీలకపాత్ర పోషించిందని చెప్పాడు.
కేవలం ఈ స్టార్ సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాదు ముఖ్యంగా భారత జట్టులోని ఆల్ రౌండర్లు అద్భుతంగా రాణించడంతో టీమ్ తన జైత్రయాత్రను కొనసాగించిందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. పాంటింగ్ ఐసీసీ డిస్కషన్ లో మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నమెంట్ అంతటా భారత జట్టు ఆల్ రౌండర్లు అద్భుతంగా రాణించారనీ, అవసరమైన సమయంలో తమ సత్తా చూపించారని కొనియాడారు.
"రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా బాగా ఆడారు. ఇండియా జట్టులో సమతూకం, యంగ్ ప్లేయర్స్, సీనియర్ల అనుభవం కలయిక ఉండటం వల్ల వాళ్లను ఓడించడం ఇతర జట్లకు కష్టంగా మారింది. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ తన జట్టు కోసం బాగా ఆడాడు" అని పాంటింగ్ అన్నాడు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన 5 మ్యాచ్‌ల్లో ముగ్గురు ఆల్ రౌండర్లతో ఆడి అద్భుత ఫలితాలు రాబట్టిందనీ, ఇండియా అద్భుతమైన బ్యాటింగ్ డెప్త్‌ను చూపించిందని పాంటింగ్ అన్నారు. బౌలింగ్‌లో కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయని బౌలింగ్ విభాగం విషయాలు ప్రస్తావించారు. "వాళ్లు మంచి బ్యాలెన్స్డ్ టీమ్.. అలాగే, వాళ్ల దగ్గర చాలా మంది ఆల్ రౌండర్లు ఉన్నారు... హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజాతో కలిసి వాళ్లు మంచి బ్యాలెన్స్డ్ టీమ్‌గా ఉన్నారని" అన్నారు.
అయితే, "ఫాస్ట్ బౌలింగ్‌లో కొంచెం వీక్‌గా ఉంది. కానీ ఇక్కడి పరిస్థితులకు అది అవసరం లేదు" అని పాంటింగ్ అన్నాడు. "హార్దిక్ పాండ్యా పాత్ర ఇక్కడ చాలా ముఖ్యం. కొత్త బంతితో బౌలింగ్ చేసి, మొదట్లో కొన్ని ఓవర్లు వేసి, స్పిన్నర్లకు పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో కొంచెం ఈజీ చేశాడు. వాళ్లు ఆట మధ్యలో స్పిన్‌ను ఎక్కువగా ఉపయోగించారు" అని ఆయన చెప్పాడు.
అక్షర్ పటేల్ పై ప్రశంసలు కురిపించిన పాంటింగ్.. "అతను భారత జట్టులో మిడిల్ ఆర్డర్ లో కీలకంగా పనిచేశాడు. అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చాలా ప్రశంసలు దక్కాలి అనుకుంటున్నా. అతని బౌలింగ్ చాలా నిలకడగా ఉంది" అని పాంటింగ్ అన్నాడు.
అలాగే, "అతను బ్యాటింగ్‌లో కొన్ని చిన్న కాంట్రిబ్యూషన్స్ చేశాడు. ముందుగా వచ్చి టీమ్‌ను నిలబెట్టాడు. కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా లాంటి ప్లేయర్లకు లైఫ్ ఈజీ చేశాడు... అతను ఈ మ్యాచ్‌లో చాలా ప్రశంసలు అందుకుంటున్నాడు" అని పాంటింగ్ అన్నారు.