- Home
- Sports
- Cricket
- Shreyas Iyer: కోహ్లి స్థానానికి ఎసరుపెట్టిన అయ్యర్.. అక్కడైతేనే బ్యాటింగ్ చేస్తాడట..
Shreyas Iyer: కోహ్లి స్థానానికి ఎసరుపెట్టిన అయ్యర్.. అక్కడైతేనే బ్యాటింగ్ చేస్తాడట..
Shreyas Iyer: సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో మూడో స్థానంలో కోహ్లి బ్యాటింగ్ కు వస్తాడు. కానీ లంకతో సిరీస్ కు అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అయ్యర్...

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో లంకతో జరిగిన టీ20 సిరీస్ లో అదరగొట్టిన యువ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్..
మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా.. 3 బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించి లంకను వైట్ వాష్ చేయడంలో కీలక భూమిక పోషించాడు. ఈ సిరీస్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అయ్యర్.. వరుస మ్యాచులలో 57, 74, 73 పరుగలతో నాటౌట్ గా నిలిచాడు. ఒక్క మ్యాచులో కూడా అతడిని లంక బౌలర్లు ఔట్ చేయలేకపోయారు.
భారత జట్టులో వన్డే, టీ20లలో మూడో స్థానం కోహ్లిది. కానీ లంకతో సిరీస్ కు అతడు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఈ సిరీస్ కు ముందు సూర్యకుమార్ యాదవ్ కు కూడా గాయం కావడంతో అయ్యర్ కు అవకాశం వచ్చింది.
కోహ్లి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అయ్యర్ కు.. టీ20లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటేనే ఇష్టమట. ఆ స్థానంలో అయితే తనకు బ్యాటింగ్ చేయడం సౌఖ్యంగా ఉంటుందని అంటున్నాడు ఈ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్..
ఇదే విషయమై అతడు స్పందిస్తూ.. ‘పొట్టి ఫార్మాట్ లో అయితే నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటే ఇష్టం. ఈ ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తేనే బాగా రాణించగలం. అలా కాకుండా మీరు ఇంకా కిందికి వెళ్తే అక్కడ ఆడటానికి పెద్దగా ఆస్కారం దక్కకపోవచ్చు.
కావున టీ20లలో నేను ఆడటానికి ఇష్టపడే స్థానం ఏదని అడిగితే నేను కచ్చితంగా మూడో స్థానాన్ని ఎంచుకుంటాను..’ అని తెలిపాడు.
బ్యాటింగ్ కు వచ్చిన ప్రతిసారి తాను మ్యాచులను ముగించాలని భావిస్తానని అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ కోసం గ్రౌండ్ లోకి అడుగుపెట్టేటప్పుడు తాను అదే మైండ్ సెట్ తో ఉంటానని చెప్పుకొచ్చాడు.
భారత జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉన్నదని, ప్రతి స్థానానికి నలుగురైదుగురు నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని అయ్యర్ అన్నాడు. వాళ్లలో చాలా మంది మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారని చెప్పాడు.
ఇదిలాఉండగా.. కోహ్లి గైర్హాజరీలో అయ్యర్ మూడో స్థానంలో ఇరగదీసినా అతడు ఆ ప్లేస్ లోనే కొనసాగుతాడని గ్యారెంటీ లేదు. అయితే గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లి పెద్దగా ఫామ్ లో లేడు. గతంలో ఉన్న ఫైర్ కూడా అతడి ఆటలో కనిపించడం లేదు.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో.. జట్టు కూర్పు కోసం ప్రయోగాలు చేస్తున్న టీమిండియా.. అయ్యర్ ను ఎలా ఉపయోగించుకుంటుంది..? అన్నది ఆసక్తిగా మారింది. అయితే త్వరలో ఐపీఎల్ లో శ్రేయస్ గానీ.. సూర్యకుమార్ యాదవ్ గానీ మెరుగైన ప్రదర్శనలు చేసి కోహ్లి విఫలమైతే గనుక ఇక విరాట్ కు కష్టమే అని భావిస్తున్నారు క్రికెట్ పండితులు..