- Home
- Sports
- Cricket
- Team India: అప్పుడంటే నడిచింది గానీ ఇప్పుడలా కాదు.. జట్టులో ఒక్కో స్థానంలో నలుగురు పోటీ
Team India: అప్పుడంటే నడిచింది గానీ ఇప్పుడలా కాదు.. జట్టులో ఒక్కో స్థానంలో నలుగురు పోటీ
Sunil Gavaskar Comments on Team India Placements: గతంలో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు.. సరిగా ఆడినా ఆడకున్నా చోటు గురించి పెద్దగా ఆందోళన చెందే అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు..

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దూసుకుపోతున్నది. స్టార్ ప్లేయర్లు లేకున్నా కీలక సిరీస్ లు నెగ్గుతున్నది. వరుసగా వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ నెగ్గిన రోహిత్ సేన.. లంకతో జరుగుతున్న టీ20 సిరీస్ ను కూడా గెలుచుకుంది.
కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ సిరీస్ లో విశ్రాంతినివ్వగా.. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ దీపక్ చాహర్, మిడిలార్డర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ లు గాయపడ్డారు. తాజాగా ఇషాన్ కిషన్ కు కూడా తలకు గాయమైంది.
అయితే విరాట్, పంత్, సూర్యకుమార్ యాదవ్, చాహర్ లు లేకున్నా యువ భారత జట్టు.. మెరుగైన ప్రదర్శనలతో అదరగొడుతున్నది.
వెస్టిండీస్ తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ లో రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ వంటి అనుభవరహిత ఆటగాళ్లతోనే సిరీస్ నెగ్గాడు రోహిత్ శర్మ. ఇక లంకతో సిరీస్ లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ల మెరుపులతో భారత్ అద్భుత విజయాలను అందుకుంది.
కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా బెంచ్ బలంగా ఉంది. ఒక్కో స్థానానికి నలుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. గతేడాది న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సందర్భంగా.. మిషన్ ఆస్ట్రేలియా (టీ20 ప్రపంచకప్-2022) ను మొదలుపెట్టిన రోహిత్ సేన.. ఆ మేరకు అందుబాటులో ఉన్న ఆప్షన్లన్నింటినీ పరిశీలిస్తున్నది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ప్లేస్ కూడా ఇప్పుడు గ్యారెంటీ లేదు. జట్టులో స్థానం నిలుపుకోవాలంటే తప్పకుండా ఆడాలి అనే పరిస్థితి నెలకొంది.
ఇదే విషయమై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఎవరి స్థానం పదిలం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పుడున్న టీమిండియాలో వన్డే, టీ20 ఫార్మాట్ లో రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని చెప్పుకొచ్చాడు టీమిండియాకు ఉత్తేజకరమైన క్షణాలున్నాయని తెలిపాడుఆటగాళ్లంతా తమ టాలెంట్ ను చూపించి మరి తమను సెలెక్ట్ చేసేలా చేస్తున్నారని చెప్పాడు.
టీమిండియాలో పోటీ ఆరోగ్యకరంగా ఉందని గవాస్కర్ అన్నాడు. తమ వెనుక ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా తుది జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తర్వాతి మ్యాచుకు కూడా జట్టులో ఉంటామని కచ్చితంగా చెప్పుకోలేరని గవాస్కర్ అన్నాడు.
గతంలో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు.. సరిగా ఆడినా ఆడకున్నా చోటు గురించి పెద్దగా ఆందోళన చెందే అవసరం ఉండేది కాదు. రిజర్వ్ ఆటగాళ్లు లేకపోవడంతో సదరు క్రికెటర్లు సరిగా ఆడకున్నా వాళ్లనే కొనసాగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరైనా ఆటగాళ్లు గాయపడినా.. సరిగా ఆడకున్నా తర్వాతి మ్యాచులో ప్లేస్ ఉంటుందా..? లేదా..? అనేది అనుమానంగానే మారింది.