- Home
- Sports
- Cricket
- ముంబై కోచ్ కు సొంత దేశంలో ప్రశ్నల వర్షం.. జాతీయ జట్టు కంటే అదే ఎక్కువైందా..? అంటూ ఆగ్రహం
ముంబై కోచ్ కు సొంత దేశంలో ప్రశ్నల వర్షం.. జాతీయ జట్టు కంటే అదే ఎక్కువైందా..? అంటూ ఆగ్రహం
Mahela Jayawardene: ‘తల్లా.. పెళ్లామా..?’ ఐపీఎల్ ఆడుతున్న చాలా మంది క్రికెటర్లను చాలాకాలంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. క్యాష్ రిచ్ లీగ్ కోసం సొంత దేశం ఆడుతున్న మ్యాచులను కూడా త్యాగం చేస్తున్న ఆటగాళ్ల పై...

గత కొన్నాళ్లుగా.. స్వదేశీ, విదేశీ క్రికెటర్లు ఎదుర్కుంటున్న ‘తల్లా, పెళ్లామా..?’ సమస్య ఇప్పుడు ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా కీర్తి గడించిన ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే కు కూడా ఎదురైంది.
ఐపీఎల్ కోసం ముంబై జట్టుతో నెలలకు నెలల పాటు రోహిత్ సేనతో గడుపుతున్న జయవర్దనే.. దేశం కోసం అంటే మాత్రం సాకులు చెప్పి ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడిపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్ కోచ్ గా ఉన్నాడు జయవర్దనే.. ఈ ఏడాది జనవరి 1 నుంచి అతడు ఈ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ తో పాటు ఆదివారం టీమిండియాతో ముగిసిన మూడు మ్యాచుల సిరీస్ కు అతడు అందుబాటులో లేడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలో కూడా.. శ్రీలంక సలహాదారుడిగా ఎంపికైన జయవర్ధనే.. మధ్యలోనే జట్టును వదిలేసి స్వదేశానికి బయల్దేరాడు. ఎలాగూ తాను హెడ్ కోచ్ కాదని, సలహాదారుడు ఎక్కడ ఉన్నా వాళ్ల పని సలహాలు ఇవ్వడమే కాబట్టి తాను ఇంటినుంచే పనిచేస్తానని లంకకు బయల్దేరాడు.
Srilanka odi
ఇక ఆస్ట్రేలియా, టీమిండియా పర్యటనల్లో కూడా జయవర్దనే.. జట్లతో లేడు. జట్టుకు దూరంగా ఇంటినుంచే ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. దీంతో జయవర్దనే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టుకు అవసరమైన సందర్భాలలో జయవర్దనే అవసరం ఎంతో ఉందని, కానీ అతడు మాత్రం డ్రెస్సింగ్ రూమ్ పంచుకోకపోవడం విడ్డూరంగా ఉందని శ్రీలంక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
ఇదే విషయమై శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రీడా జర్నలిస్టు రాక్స్ క్లెమెంటైన్ ఓ పత్రికకు వ్యాసం రాస్తూ... ‘ఆస్ట్రేలియా, ఇండియా టూర్స్ చాలా ప్రత్యేకమైనవి.. ఎంతో సవాల్ తో కూడుకున్నవి. కానీ అతడు (జయవర్దనే) మాత్రం డ్రెస్సింగ్ రూమ్ లో లేడు. దానికి బదులుగా వర్చువల్ గా సలహాలిచ్చాడని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ లో ఇలా టోర్నీ మధ్యలో విరామాలు తీసుకుంటే మాత్రం అంబానీ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం)లు మాత్రం ఊరుకోరు..’ అని రాసుకొచ్చాడు.
అంతేగాక.. ‘జాతీయ జట్టుతో కలిసి పనిచేయడానికి జయవర్దనే కు నిబద్ధత అవసరం. కానీ అతడికి అది లేనట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. లంకకు జాతీయ కోచ్ కూడా లేడు. ఈ సమయంలో అతడి అవసరం జట్టుకు ఎంతో ఉంది. కానీ మహేళ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం బాధాకరం..’ అని ఘాటు కామెంట్స్ చేశాడు రాక్స్..
మహేళ విషయమై శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ అంటే నెలల తరబడి గడిపే మహేళ.. జాతీయ జట్టుకు అంటే మాత్రం ఏదో సాకుతో తప్పించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. మహేళ తో పాటు రాజస్థాన్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న కుమార సంగక్కర పై కూడా శ్రీలంక అభిమానులు విమర్శలు కురిపిస్తున్నాడు. శ్రీలంకకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన ఈ దిగ్గజాలు.. జాతీయ జట్టు గురించి కూడా ఆలోచించాలని సూచిస్తున్నారు.