MI vs RCB: వాంఖడే వేదికగా మరో ఆసక్తికర పోరు.. ముంబై తీరు మారుతుందా.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మరో ఆసక్తికర పోరుకు వాంఖడే స్టేడియం వేదిక కాబోతోంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తలపడ్డాయి.? వీరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ఇప్పటివరకు 33 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లలో MI 19 విజయాలు సాధించగా, RCB 14 విజయాలు సాధించింది. ఈ గణాంకాల ప్రకారం ముంబై ఇండియన్స్‌కు ఈ ప్రత్యర్థిత్వంలో పైచేయి కనిపిస్తోంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ తన హోం గ్రౌండ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను ఆతిథ్యమిస్తోంది.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో కేవలం 2 పాయింట్లతో పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. అదీ కాకుండా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఇక బెంగళూరును ముంబైతో పోలిస్తే సీజన్ కొంచెం మెరుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడి 4 పాయింట్లతో టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది.
ముంబై, బెంగళూరు మధ్య ఐపీఎల్ రికార్డులు ఎలా ఉన్నాయంటే.?
మొత్తం మ్యాచ్‌లు:
ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య 33 మ్యాచ్‌లు జరగాయి. వీటిలో ముంబై ఇండియన్స్ 19, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌లు గెలిచారు. ఇందులో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లి RCB గెలిచింది.
ఇక వాంఖడే స్టేడియం విషయానికొస్తే ఈ రెండు జట్లు మొత్తం 11 మ్యాచ్‌లు ఆడగా వీటిలో ముంబై ఇండియన్స్ 8 మ్యాచుల్లో, బెంగళూరు 3 మ్యాచుల్లో గెలుపొందాయి. ఏప్రిల్ 11, 2024 – వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గణంకాల ప్రకారం చూస్తే వాంఖడేలో ముంబైకి పైచేయి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI) రికార్డులు:
వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మొత్తం 86 మ్యాచులు ఆడగా వీటిలో 52 గెలిచాయి, 33 ఓడిపోయాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం లేదు. ఈ స్టేడియంలో ముంబై అత్యధిక స్కోర్ 234. 2024 ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై 29 పరుగుల తేడాతో గెలిచింది ఇది వాంఖడేలో MI అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే ఈ స్టేడియంలో ముంబై అత్యల్ప స్కోర్ 87 పరుగులు మాత్రమే. 2018, ఏప్రిల్ 24న ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 31 పరుగులు సాధించింది.
వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రాక్ రికార్డు:
ఈ స్టేడియంలో ఆర్సీబీ మొత్తం 18 మ్యాచ్‌లు ఆడగా వీటిలో 8 మ్యాచ్‌లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆర్సీబీ ఈ స్టేడియంలో అత్యధికంగా చేసిన స్కోర్ 235 పరుగులు. అది ముంబై ఇండియన్స్‌పై కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 39 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఏప్రిల్ 25, 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేసిన 122 అత్యల్ప స్కోర్. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 69 పరుగుల తేడాతో ఓడిపోయింది.