MI vs RCB: బెంగళూరు విజయం అంత వీజీ ఏం కాదు.. ఆ ముగ్గురితో పొంచి ఉన్న ప్రమాదం
ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబైని ఓడించి వాంఖడే స్టేడియంలో జెండా పాతాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే బెంగళూరుకు విజయం అంత ఈజీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ముగ్గురు బౌలర్స్‌తో ఆర్సీబీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు.? వారితో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

MI vs RCB
ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయంలో చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా ముగ్గు పేసర్లతో బౌలింగ్‌లో తగ్గేదేలే అన్నట్లు ఉంది. ఇందుకు అనుగుణంగా తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్‌ను ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా, చాహర్, బౌల్ట్ ఈ పేస్ త్రయంతో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది. ఇంతకీ వీరి ముగ్గురిపై అంతలా అంచనాలు ఉండేందుకు బలమైన కారణం ఉందని తెలుసా.? ఇంతకీ అదేంటంటే.
బెంగళూరు టీమ్‌లో స్టార్ బ్యాటర్ అయిన విరాట్‌ను దీటుగా ఎదుర్కోవడంలో జస్‌ప్రీత్ బుమ్రా ముందు వరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 16 మ్యాచ్‌ల్లో తలపడ్డారు. బుమ్రా బౌలింగ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 140 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీని బుమ్రా 5 సార్లు అవుట్ చేశారు.
ఇదిలా ఉంటే దీపక్ చాహర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాహర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 85 మ్యాచ్‌లు ఆడి 81 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 63 వికెట్లు పవర్‌ప్లేలోనే తీయడం విశేషం. కాబట్టి మొదటి 6 ఓవర్లలో చాహర్ RCBకి సవాల్ విసిరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ రికార్డు సృష్టించాడు.
బౌల్ట్ పవర్‌ప్లేలో 107 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 64 వికెట్లు పడగొట్టాడు. అలాగే బుమ్రా సైతం పవర్ ప్లేలో 76 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్‌లు రంగంలోకి దిగుతుండడంతో అందరి దృష్టి ముంబై ఇండియన్స్ బౌలింగ్ పై పడింది.
తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుతుర్.