పాకిస్తాన్ ను చెడుగుడు ఆడుకున్న భారత్
IND W vs PAK W : టీ20 ప్రపంచ కప్ 2024 మహిళా క్రికెట్ లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 7వ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. ఐసీసీ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది.
India Women, cricket, Team india, ICC Womens T20 World Cup 2024
IND W vs PAK W : టీ20 ప్రపంచ కప్ 2024లో తన రెండో మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు చేసింది. 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఈ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
India Women, cricket, Team india, ICC Womens T20 World Cup 2024
దుమ్మురేపిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విధ్వంసం సృష్టించారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు తమ బౌలింగ్ తో చెమటలు పట్టించారు. దీంతో పాకిస్థాన్‌లో కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. నిదా దార్ అత్యధిక స్కోరు 28 పరుగులు చేశారు. మునిబా అలీ 17 పరుగులు, ఆరూబ్ షా 14 నాటౌట్, కెప్టెన్ ఫాతిమా సనా 13 పరుగులు చేశారు.
భారత్ తరఫున అరుంధతి రెడ్డి అత్యధికంగా 3 వికెట్లు తీశారు. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసుకున్నారు. రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్ తీశారు. శ్రేయాంక పాటిల్ తన స్పెల్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఇద్దరు బ్యాటర్లను అవుట్ చేసింది. బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి 3/19 విలువైన గణాంకాలను నమోదుచేసింది.
Harmanpreet Kaur
బ్యాట్ తో మెరిసిన షెఫాలీ వర్మ - హర్మన్‌ప్రీత్ కౌర్
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 24 బంతుల్లో 29 పరుగులు చేసి రిటైర్డ్ అయింది. హర్మన్‌ప్రీత్ 19వ ఓవర్‌లో మెడకు గాయమైంది, కానీ అంతకు ముందే ఆమె తన పనిని పూర్తి చేసింది. టీమ్ ఇండియాను విజయపథంలోకి నడిపించింది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్‌తో పాటు షెఫాలీ వర్మ 32 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 23 పరుగులు చేశారు. స్మృతి మంధాన 7 పరుగుల వద్ద అవుటైంది. రిచా ఘోష్ ఖాతా తెరవలేకపోయింది. దీప్తి శర్మ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. సజీవన్ సజ్నా 4 పరుగులతో అజేయంగా ఉన్నారు. పాక్ తరఫున కెప్టెన్ ఫాతిమా సనా 2 వికెట్లు పడగొట్టింది.
India Women, cricket, Team india, ICC Womens T20 World Cup 2024
మహిళా టీ20 ప్రపంచ కప్ 2024- పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి భారత్
పాకిస్తాన్ పై విజయంతో భారత మహిళా జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అయితే, ఇప్పటికీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉంది. నాలుగు టీమ్ లకు రెండేసి పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ ఆధారంగా టీమ్ ఇండియా నాలుగో స్థానంలో ఉంది.
తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి
మహిళా టీ20 ప్రపంచ కప్ 2024 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. 58 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 160/4 పరుగులు చేసింది. 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 102 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్టార్ బ్యాటర్లలో ఒక్కరు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది.
India Women, cricket, Team india, ICC Womens T20 World Cup 2024
ఇక తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ అద్భుతమైన రీతిలో విజయం సాధించింది. పాకిస్తాన్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసి PAKW 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రబోధని, సుగందికా కుమారి, చమరి అతపట్టులు తలా మూడేసి వికెట్లు తీసుకున్నారు. కవిషా దిల్హరికి ఒక వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు పాకిస్తాన్ తన అద్భుతమైన బౌలింగ్ తో బిగ్ షాక్ ఇచ్చింది. కట్టుదిట్టమైన పాక్ బౌలింగ్ కారణంగా శ్రీలంక టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాదియా ఇక్బాల్ మూడు వికెట్లు తీసుకున్నారు. ఫాతిమా సనా 2, ఒమైమా సోహైల్ 2, నష్రా సంధు 2 వికెట్లు తీసుకున్నారు.