Asia Cup Final : భారత్ vs పాకిస్థాన్.. 41 ఏళ్లలో తొలిసారి.. గెలిచేది ఎవరు?
India vs Pakistan : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ vs పాకిస్థాన్ తొలిసారి పోటీ పడుతున్నాయి. 41 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి ఈ రెండు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.

41 ఏళ్లలో తొలి భారత్–పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్
ఆసియా కప్ 2025 చరిత్ర సృష్టించనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన 41 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్, పాకిస్థాన్ ఫైనల్‌లో తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా, భారత్ కూడా సూపర్ 4లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వివాదాలు
గత రెండు మ్యాచ్‌లలో భారత్–పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫైనల్‌లో అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. “మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. జట్టుకు కావలసిన సామర్థ్యం ఉంది. ఆదివారం భారత్‌ను ఓడించేందుకు కృషి చేస్తాం” అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నాడు. అలాగే, ఇప్పటికే ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లలో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్ ఫైనల్ లో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది.
భారత్–పాకిస్థాన్ ఫైనల్స్ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ లు ఐదు సార్లు మల్టీనేషన్ టోర్నమెంట్లలో ఫైనల్స్‌లో తలపడ్డాయి. భారత్ రెండు సార్లు గెలిచింది. పాకిస్థాన్ మూడు సార్లు విజయం సాధించింది.
• భారత్ విజయాలు: 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్, 2007 తొలి T20 వరల్డ్ కప్.
• పాకిస్థాన్ విజయాలు: 1986 ఆస్ట్రల్ ఆసియా కప్, 1994 ఆస్ట్రల్ ఆసియా కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.
అయితే ఆసియా కప్‌లో మాత్రం ఇంతవరకు ఫైనల్ పోరులో ఇరు జట్లు పోటీ పడలేదు. 2025లోనే తొలిసారి ఈ రెండు జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. అయితే, ఆసియా కప్ లో భారత్ కు సూపర్ రికార్డు ఉంది.
ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం
ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 టైటిళ్లు గెలిచింది. వీటిలో 1984, 1988, 1990–91, 1995, 2010, 2016 (T20), 2018, 2023 ఉన్నాయి. శ్రీలంక 6 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు టైటిల్ గెలిచాయి. భారత్ మూడు సార్లు రన్నరప్‌గా కూడా నిలిచింది.
2023లో శ్రీలంకపై విజయం సాధించి భారత్ 8వ టైటిల్ అందుకుంది. విరాట్ కోహ్లీ 2012లో పాకిస్థాన్‌పై 183 పరుగులు చేయడం, మొహమ్మద్ సిరాజ్ 2023 ఫైనల్‌లో శ్రీలంకపై 6/21 బౌలింగ్ చేయడం ఆసియా కప్ చరిత్రలో ప్రత్యేక రికార్డులుగా ఉన్నాయి.
సూర్యకుమార్ కెప్టెన్సీలో సూపర్ పవర్ గా భారత్
ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ జట్టు చాలా బలంగా ఉంది. ఆసియా కప్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, దుబేలు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తుననారు. అలాగే, బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.