India vs England : రోహిత్, విరాట్ లేకపోవడంతో భారత్‌కు కలిగే నష్టాలు ఇవే
India vs England Series: టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు పెద్ద నష్టంగా మారనుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకపోవడం వల్ల భారత జట్టుకు కలిగి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

India vs England Series: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లి 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. జట్టు ఎంపిక ఇంకా ప్రకటించబడలేదు, దానికి ముందే భారత జట్టుకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. అవును, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు.
గత వారం రోహిత్ టెస్ట్ మ్యాచ్‌ల నుండి రిటైర్ అయ్యాడు, ఆ తర్వాత సోమవారం విరాట్ కోహ్లీ కూడా రిటైర్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ముందు భారత్‌కు పెద్ద షాక్ అని చెప్పాలి.
విరాట్, రోహిత్ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ కావచ్చని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కానీ, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు వారు రిటైర్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. జూన్ 20 నుండి భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ నేపథ్యంలో, అక్కడి వేగవంతమైన పిచ్‌లపై ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల లేకపోవడం భారత్‌కు పెద్ద సమస్యగా మారనుంది. రోహిత్, కోహ్లీ లేకపోవడం వల్ల భారత జట్టుకు ఎదురయ్యే నష్టాలు చాలానే ఉన్నాయి.
భారత జట్టుకు ఓపెనర్ ఎవరు?
ఇంగ్లాండ్ వంటి వేగవంతమైన పిచ్‌లపై అనుభవజ్ఞుడైన ఓపెనర్ ఉండటం భారత జట్టుకు చాలా అవసరం. రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌ల నుండి రిటైర్ అయ్యాడు. దీంతో యశస్వి జైస్వాల్‌తో ఎవరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారనేది జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారనుంది. రోహిత్ శర్మకు మంచి అనుభవం ఉంది. ప్రత్యర్థి బౌలర్లను చితక్కొడతాడు. 67 టెస్ట్ మ్యాచ్‌లలో 116 ఇన్నింగ్స్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు.
మిడిల్ ఆర్డర్ సమస్య
ఓపెనర్ తర్వాత భారత జట్టు మిడిల్ ఆర్డర్‌లో పెద్ద సమస్య ఏర్పడుతుంది, ఎందుకంటే విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడేవాడు. కోహ్లీ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూ రన్ రేట్‌ను స్థిరంగా ఉంచుతాడు. కోహ్లీ లేని పక్షంలో, మరో బ్యాట్స్‌మన్ ఈ బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ 123 మ్యాచ్‌లలో 210 ఇన్నింగ్స్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కోహ్లీ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటు.
నాయకత్వ లోపం
ఒక పెద్ద సిరీస్‌లో ప్రతి జట్టుకు మంచి కెప్టెన్ అవసరం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి కెప్టెన్లుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరూ లేకపోవడంతో భారత జట్టులో అంతగా అనుభవం, నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాళ్లు లేరు. జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, విరాట్, రోహిత్ లాగా వారు దూకుడుగా నాయకత్వం వహించలేరు.

