Shubman Gill: ఇంగ్లాండ్ పై గెలుపు.. శుభ్‌మన్ గిల్ 12 ప్రపంచ రికార్డులు
Shubman Gill sets 12 Test world records: బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో 12 ప్రపంచ రికార్డులను సృష్టించాడు.
- FB
- TW
- Linkdin
Follow Us

బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ చరిత్రాత్మక ప్రదర్శన
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్ పై 336 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
గిల్ ఒక్క టెస్ట్ మ్యాచ్‌లోనే మొత్తం 430 పరుగులు చేశాడు. ఏకంగా 12 టెస్ట్ ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసున్నాడు. ఈ విజయంతో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు. ఆ రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఎడ్జ్‌బాస్టన్ లో భారత్ కు తొలి విజయం
శుభ్ మన్ గిల్ కెప్టెన్ అయిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసింది కానీ, ఫీల్డింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ తప్పిదాలతో మ్యాచ్ ను కోల్పోయింది. అయితే, రెండో టెస్టులో పుంజుకుని బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి విజయాన్ని అందుకుంది. భారత జట్టుకు చాలా మంది లెజెండరీ ప్లేయర్లు కెప్టెన్ గా చేసినా.. ఎడ్జ్‌బాస్టన్ లో విజయాన్ని అందించలేకపోయారు. అయితే, గిల్ కెప్టెన్ గా తన తొలి సిరీస్ లోనే ఇక్కడ భారత్ కు భారీ విజయాన్ని అందించాడు.
2. ఒక్క టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాట్స్‌మన్
శుభ్‌మన్ గిల్ ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో 430 పరుగులు చేయడం ద్వారా ఆసియా ఖండానికి చెందిన ఆటగాళ్లలో ఇదివరకు ఎవరూ చేయని రికార్డును నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన రెండవ ఆటగాడు. అతనికంటే ముందు కేవలం గ్రాహమ్ గూచ్ మాత్రమే 1990లో లార్డ్స్ వేదికగా భారత్‌పై 456 పరుగులు చేశారు.
3. భారత కెప్టెన్‌గా టెస్ట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్
శుభ్ మన్ గిల్ 387 బంతుల్లో 269 పరుగులతో డబుల్ సెంచరీ నాక్ తో పలు రికార్డులు సాధించాడు. భారత కెప్టెన్‌గా టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 2019లో సౌతాఫ్రికాపై నాటౌట్‌గా చేసిన 254 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు.
4. ఒకే టెస్ట్‌లో 250+, 150+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్
శుభ్ మన్ గిల్ టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 250+, 150+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. 148 ఏళ్ళ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
5. ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మూడవ భారతీయుడు
ఈ రికార్డుతో శుభ్ మన్ గిల్, ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన మూడవ భారత బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. అంతకుముందు, సునీల్ గవాస్కర్ (1979లో 221 పరుగులు), రాహుల్ ద్రావిడ్ (2002లో 217 పరుగులు) డబుల్ సెంచరీ కొట్టారు.
6. ఇంగ్లాండ్‌లో భారత బ్యాట్స్‌మన్‌గా అత్యధిక స్కోర్
269 పరుగులతో శుభ్ మన్ గిల్, 1979లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగుల రికార్డును అధిగమించి, ఇంగ్లాండ్‌లో అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన భారతీయుడిగా నిలిచాడు.
7. కెప్టెన్‌గా తొలి రెండు టెస్ట్‌లలో మూడు సెంచరీలు
తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనే మూడు సెంచరీలు చేసిన రెండవ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఇది సాధించాడు. ఇప్పటివరకు ఈ ఘనతకు మొత్తం ఎనిమిది మంది కెప్టెన్లు మాత్రమే చేరుకున్నారు.
8. ఒకే టెస్ట్‌లో రెండు 150+ ఇన్నింగ్స్‌లు
గిల్, టెస్ట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు 150+ పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. మొదటి ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్, 1980లో లాహోర్‌లో 150*, 153 పరుగులు చేశారు.
9. రెండు టెస్ట్‌లలో అత్యధిక పరుగులు
ఈ టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో గిల్ 146.25 సగటుతో మొత్తం 585 పరుగులు చేశాడు. అతని ముందు కేవలం గ్రేమ్ స్మిత్ మాత్రమే ఉన్నాడు. ఆయన 2003లో ఇంగ్లాండ్‌పై మొదటి రెండు టెస్టుల్లో 621 పరుగులు చేశారు.
10. ఒకే టెస్ట్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ
శుభ్‌మన్ గిల్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. 1971లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై ఈ ఘనతను సాధించారు.
11. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన మూడవ భారత కెప్టెన్
శుభ్ మన్ గిల్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మూడవ భారత కెప్టెన్ గా నిలిచాడు. అంతకుముందు, సునీల్ గవాస్కర్ (1978, కోల్ కతా), విరాట్ కోహ్లీ (2014, అడిలైడ్) ఈ ఘనత సాధించారు.
12. ఒకే టెస్ట్‌లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగస్వామిగా గిల్
శుభ్ మన్ గిల్, ఒకే టెస్ట్ మ్యాచ్‌లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగం అయిన తొలి భారతీయుడు, ప్రపంచంలో 5వ ఆటగాడిగా నిలిచాడు. గిల్ కంటే ముందు హనీఫ్ మహమ్మద్ (1958), గ్రాహం గూచ్ (1990), మార్క్ టేలర్ (1998), జో రూట్ (2016) మాత్రమే ఈ ఘనత సాధించారు.