- Home
- Sports
- Cricket
- బెంగాల్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీసీసీఐ.. టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గంగూలీ సొంతరాష్ట్రంలో కూడా..
బెంగాల్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీసీసీఐ.. టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గంగూలీ సొంతరాష్ట్రంలో కూడా..
India Vs West Indies ODI: 'దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు' అన్నట్టు అయిపోయింది టీమిండియా ఫ్యాన్స్ పరిస్థితి. అహ్మదాబాద్ లో వన్డే సిరీస్ చూసే అదృష్టం లేకపోయినా బెంగాల్ లో జరిగే టీ20లు అయినా వీక్షిద్దామనుకున్న అభిమానులకు...

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లను చూసే అదృష్టం లేకున్నా కనీసం టీ20 లు అయినా చూద్దామని భావించిన క్రికెట్ ఫ్యాన్స్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాక్ ఇచ్చింది.
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టు అయిపోయింది భారత క్రికెట్ అభిమానుల పరిస్థితి. వెస్టిండీస్ తో నిర్వహించనున్న టీ20 సిరీస్ చూడటానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతినిచ్చినా బీసీసీఐ మాత్రం అందుకు నిరాకరించింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నుంచి మొదలుకాబోయే వన్డే సిరీస్ ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే దీనిమీద స్పష్టమైన ప్రకటన చేసింది.
అయితే టీ20 సిరీస్ జరుగబోయే ఈడెన్ గార్డెన్ లో మాత్రం ప్రేక్షకులను అనుమతించుతామని.. ఇండోర్, అవుట్ డోర్ లో నిర్వహించుకునే క్రీడా కార్యక్రమాలను 75 శాతం మందిని అనుమతించవచ్చునని బెంగాల్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీంతో వన్డే సిరీస్ టీవీలో చూసినా టీ20 సిరీస్ అయినా ప్రత్యక్షంగా చూడొచ్చులే అని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది
కానీ ఇప్పుడు బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అహ్మదాబాద్ లో మాదిరిగానే కోల్కతాలో కూడా ప్రేక్షకుల్లేకుండానే మ్యాచులను నిర్వహించాలని నిర్ణయించింది.
ఇదే విషమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘మేము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అహ్మదాబాద్ లో వన్డే సిరీస్ ప్రేక్షకుల్లేకుండానే నిర్వహిస్తున్నాం. కోల్కతాలో కూడా అలాగే నిర్వహిస్తాం. కోల్కతాలో మ్యాచులు నిర్వహించినంత మాత్రానా ఇక్కడ ప్రేక్షకులను అనుమతించాలని ఏమీ లేదు...’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కాగా బీసీసీఐ తాజా నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బీసీసీఐ చీఫ్ సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్. ఇక కోల్కతా ఈడెన్ గార్డెన్ ఆయనకు సొంత గ్రౌండ్ వంటిది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా గంగూలీకి సత్సంబంధాలే ఉన్నాయి.
ఒకప్పుడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో చక్రం తిప్పిన గంగూలీ ఇప్పుడు బీసీసీఐ బాస్ గా వ్యవహరిస్తున్నాడు. కానీ తన సొంత గ్రౌండ్ లో జరిగే మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించుకోవచ్చునని ప్రభుత్వమే అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా గంగూలీ మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్లుతున్నాడని భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే విండీస్ తో సిరీస్ కు ముందు భారత క్రికెట్ జట్టులోని శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ వంటి ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో టీమిండియా ఆత్మ రక్షణలో పడింది. ఈ సిరీస్ లో తదుపరి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రేక్షకులు లేకుండానే నిర్వహించడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు.