IND vs NZ: 720 పరుగులు చేసినా గెలవలేకపోయిన టీమిండియా.. అసలు కారణాలు ఇవే
India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 720/9d పరుగులు చేసినా విజయం దక్కలేదు. మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటంతో మ్యాచ్ డ్రా అయింది. టీమిండియా గెలవలేకపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కేఎల్ రాహుల్, పంత్ సెంచరీలు వృథా.. చేతిదాకా వచ్చిన విజయాన్ని వదులుకున్న గిల్ సేన
వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ లో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరిత పోరు తర్వాత డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏకంగా 720/9 (డిక్లేర్డ్) పరుగుల భారీ స్కోరు సాధించి 352 పరుగుల ఆధిక్యం సంపాదించినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు.
ఐదో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 0-0తో సమంగా నిలిచింది. గెలవాల్సిన మ్యాచ్ చేజారడానికి గల ప్రధాన కారణాలను గమనిస్తే..
రాహుల్, పంత్ మెరిసినా ఫలితం శూన్యం
న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136 పరుగులు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ (128 పరుగులు) తనదైన శైలిలో చెలరేగాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), ధ్రువ్ జురెల్ (78) కూడా రాణించడంతో భారత్ న్యూజిలాండ్ గడ్డపై తమ అత్యధిక టెస్టు స్కోరు (720/9d) నమోదు చేసింది. తొలి ఏడు వికెట్ల భాగస్వామ్యాలు 50 పరుగులు దాటడం టెస్టు క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డుగా నిలిచింది. కానీ, ఇంతటి భారీ స్కోరు సాధించడానికి భారత్ 166 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం వల్ల మ్యాచ్‌లో సమయం తగ్గిపోయింది.
బ్యాటింగ్ కు అనుకూలంగా మారిన వెల్లింగ్టన్ పిచ్
మ్యాచ్ ప్రారంభంలో పిచ్‌పై ఉన్న పచ్చిక తర్వాత పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. ఐదో రోజు కూడా పిచ్‌లో ఎలాంటి పగుళ్లు ఏర్పడకపోవడం బౌలర్లకు పెద్ద మైనస్‌గా మారింది. బంతికి పెద్దగా టర్న్ గానీ, అదనపు బౌన్స్ గానీ లభించలేదు. ఫ్లాట్ పిచ్‌పై వికెట్లు తీయడానికి భారత పేసర్లు, స్పిన్నర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2015 తర్వాత బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగిన 15 టెస్టుల్లో మ్యాచ్ డ్రా కావడం ఇది కేవలం రెండోసారి మాత్రమే.
మిచెల్, ఫిలిప్స్ అడ్డుగోడలా మారడం
352 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టును ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా దెబ్బతీశాడు. కెప్టెన్ టామ్ లాథమ్‌ను డకౌట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. డెవాన్ కాన్వే (65), రచిన్ రవీంద్ర (37) కాసేపు పోరాడినా ప్రసిద్ధ్ కృష్ణ (2/23), వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్ వికెట్లు తీయడంతో కివీస్ 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (49 నాటౌట్, 186 బంతులు), గ్లెన్ ఫిలిప్స్ (26 నాటౌట్, 126 బంతులు) భారత బౌలర్లకు అడ్డుగోడలా నిలిచారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జోడించి, ఏకంగా 259 బంతులను ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడారు.
చేజారిన క్యాచ్‌లు, రనౌట్ అవకాశాలు
ఐదో రోజు ఆటలో భారత ఫీల్డర్లు కొన్ని కీలక అవకాశాలను మిస్ చేశారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ బంతిని సరిగ్గా అందుకోలేకపోవడంతో డారిల్ మిచెల్ తృటిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మిచెల్ ఆఖరి వరకు క్రీజులో పాతుకుపోయి భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. అలాగే సిల్లీ పాయింట్ వద్ద దేవదత్ పడిక్కల్ ఒక కష్టతరమైన క్యాచ్‌ను జారవిడిచాడు. రివ్యూలలోనూ అంపైర్స్ కాల్ రూపంలో అదృష్టం కివీస్ బ్యాటర్లకే కలిసొచ్చింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి దెబ్బ
ఈ మ్యాచ్ డ్రా కావడం టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC 2025-27) ఫైనల్ అవకాశాలను గట్టిగా దెబ్బతీసింది. ఫైనల్ చేరాలంటే భారత్ తమ మిగిలిన ఏడు మ్యాచ్‌లలో ఆరు గెలవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ డ్రాతో భారత్ పాయింట్ల శాతం 50కి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ 66.67 శాతంతో మూడో స్థానానికి పడిపోగా, ఆస్ట్రేలియా (69.23 శాతం) రెండో స్థానానికి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా (75.00 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతోంది.















