- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ ఎక్కడ..? ఇంగ్లాండ్ కు వెళ్లే జట్టుతో కనిపించని సారథి.. గల్లీ క్రికెట్ ఆడుతూ అక్కడే ఆగిపోయాడా?
రోహిత్ శర్మ ఎక్కడ..? ఇంగ్లాండ్ కు వెళ్లే జట్టుతో కనిపించని సారథి.. గల్లీ క్రికెట్ ఆడుతూ అక్కడే ఆగిపోయాడా?
IND vs ENG: గతేడాది ఇంగ్లాండ్ తో మిగిలిపోయిన ఆఖరి టెస్టు కోసం భారత జట్టు యూకేకు పయనమైంది. ఇంగ్లాండ్ కు వెళ్లిన తొలి బ్యాచ్ లో రోహిత్ శర్మ కనిపించలేదు. ఐపీఎల్-15 తర్వాత అతడు దక్షిణాఫ్రికా సిరీస్ కు కూడా అందుబాటులో లేడనే విషయం తెలిసిందే. ఐపీఎల్ తర్వాత అతడు కాస్త విరామం తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ తో గతేడాది అర్థాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా యూకేకు బయల్దేరింది. బుధవారం రాత్రి తొలి బ్యాచ్ ఇంగ్లాండ్ కు పయనమైంది.
బీసీసీఐ షేర్ చేసిన ఫోటోల్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శుభమన్ గిల్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ లు ఉన్నారు.
ఈ మేరకు వీరంతా విమానాశ్రయంలోకి చేరుకుని అందరూ కలుసుకున్నప్పటి ఫోటోతో పాటు విమానంలో ఉన్న పలు ఫోటోలను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఈ ఫోటోలలో ఒక్కదాంట్లో కూడా టీమిండియా సారథి రోహిత్ శర్మ లేకపోవడం గమనార్హం.
దీనిపై టీమిండియా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రోహిత్ ఎక్కడ..? అని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. కెప్టెన్ ఎక్కడున్నాడు..? ఎందుకు ఫోటోలలో కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
అయితే పలువురు నెటిజన్లు మాత్రం.. రోహిత్ బుధవారం వర్లీ (ముంబై) లో గల్లీ క్రికెట్ ఆడుకుంటూ కనిపించాడని, హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ కు వెళ్లడం మరిచిపోయాడేమోనని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రోహిత్ ఫోటోలలో ఎందుకు లేడనే విషయమై బీసీసీఐ స్పందించలేదు.
ఇంగ్లాండ్ కు రెండో బ్యాచ్ ఈ నెల 19న రాత్రి వెళ్లనుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ ముగిసిన తర్వాత రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ ద్రావిడ్ లు ఇంగ్లాండ్ కు బయల్దేరతారు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. జులై 1 నుంచి ప్రారంభం కాబోయే చివరి టెస్టు ఆడుతుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కాగా గతేడాది జరిగిన నాలుగు టెస్టులలో ఇప్పటికే టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.