పాక్ జట్టు ఎప్పుడూ ఇంతే.! వారానికోసారి అది చెయ్యకపోతే నిద్రపట్టదు
PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని గడ్డు పరిస్థితులు, రాజకీయ జోక్యంపై మాజీ కోచ్ జాసన్ గిలెస్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీబీ చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తనను అవమానించారని, జట్టు ఎంపికలో జోక్యం చేసుకుని కోచ్‌గా తన నిర్ణయాలను పక్కనపెట్టేశారని ఆరోపించారు.

పాక్ జట్టు ఎప్పుడూ..
పాకిస్తాన్ క్రికెట్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితులు, రాజకీయ జోక్యంపై ఆ జట్టు మాజీ టెస్ట్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జాసన్ గిలెస్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తనను తీవ్రంగా అవమానించారని, కోచ్‌గా తనకు ఉండాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని గిలెస్పి ఆరోపించారు. పాకిస్తాన్ క్రికెట్ పతనానికి ఇవే చీకటి నిజాలను ఆయన అభివర్ణించారు.
టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు..
గిలెస్పి పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారని ఒప్పందం జరిగింది. అయితే, కొద్ది రోజుల్లోనే పీసీబీ.. కొత్త సెలక్షన్ కమిటీని నియమించి కోచ్ అధికారాలను పూర్తిగా తగ్గించింది. 'నన్ను కేవలం మైదానంలో పర్యవేక్షించే వ్యక్తిగా మార్చారు. జట్టు ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. ఒక అంతర్జాతీయ కోచ్‌ను ఇలా అవమానించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని' గిలెస్పి వాపోయారు.
పీసీబీ చైర్మన్‌పై ఆగ్రహం..
అలాగే, పీసీబీ చైర్మన్ మహ్సిన్ నఖ్వీ తీరుపై గిలెస్పి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బోర్డు నిర్ణయాలు క్రికెట్ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నఖ్వీ, బోర్డు సభ్యులు కోచ్‌లకు తగిన గౌరవం ఇవ్వరని, నిర్ణయాలు తీసుకోవడంలో కోచ్‌ల అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోరని గిలెస్పి పేర్కొన్నారు.
బోర్డులోని అస్థిరతే ప్రధాన కారణం..
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు బోర్డులోని అస్థిరతే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఆటగాళ్లలో ప్రతిభ ఉందని, కానీ బోర్డులో ప్రతి వారం నిర్ణయాలు మారుతూ ఉంటాయని ఆయన తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్‌లో భద్రతా భావం లేకపోవడం వల్ల ఈ గందరగోళం ఆటగాళ్ల ప్రదర్శనను దెబ్బతీస్తోందని ఆయన చెప్పారు.
అర్ధాంతరంగా తప్పించారు..
తనను కూడా అర్ధాంతరంగా తప్పించడం వారి అస్థిరతకు నిదర్శనమని గిలెస్పి పేర్కొన్నారు. కేవలం కొన్ని పరాజయాలకే కోచ్‌లను మార్చడం వల్ల జట్టు ఎప్పటికీ స్థిరపడదని ఆయన హెచ్చరించారు. గిలెస్పి వంటి నిజాయితీ గల కోచ్‌ను పాక్ బోర్డు కోల్పోవడంపై అభిమానులు కూడా పీసీబీపై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ పరువు పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

