యశస్వి మ్యాజిక్ లేదు.. కోహ్లీ రన్ మిషనూ లేదు.. తొలిరోజు భారత్ కు షాక్
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా అడిలైడ్ ఒవల్ లో రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. తొలి రోజు భారత్ కు షాక్ తగిలింది.
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భారత్ అద్భుతంగా మొదలుపెట్టింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాకిచ్చింది. 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రాబోయే టెస్టులలో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. అయితే, రెండో టెస్టులో తొలి రోజు భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
అడిలైడ్ టెస్టు తొలి రోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ కనిపించింది. టాస్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అనుకూలంగా పడినప్పటికీ, భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. తొలిరోజు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కంగారూ జట్టు స్వల్ప స్కోరుకే భారత జట్టును చిత్తు చేసింది. బ్యాటింగ్‌లోనూ భారత్‌కు సవాల్ విసిరిన ఆతిథ్య జట్టు రెండో రోజు మ్యాచ్ ట్రెండ్ మారుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యశస్వి జైస్వాల్ మ్యాజిక్ పనిచేయలేదు
పెర్త్ టెస్టులో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అతడిని 0 పరుగుల వద్ద అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ 37 పరుగులు, శుభ్‌మన్ గిల్ 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. అడిలైడ్‌లో విరాట్ కోహ్లి అద్భుత సెంచరీ సాధించడంతో అందరి దృష్టి అతని తర్వాతి ఇన్నింగ్స్ పై ఉంది. కానీ దురదృష్టవశాత్తు కోహ్లి కేవలం 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.
నితీశ్‌రెడ్డి మరోసారి తన బ్యాటింగ్ సత్తా చూపించాడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి కష్టకాలంలో భారత్‌కు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అదే రకమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు పరువు కాపాడాడు. నితీష్ రెడ్డి 54 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రిషబ్ పంత్ 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాదే పై చేయి..
24 పరుగుల వద్ద బుమ్రా తొలి వికెట్ తీయడంతో భారత్‌కు బౌలింగ్‌లో మంచి ఆరంభం లభించింది. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియన్ స్టార్లు మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ నిలదొక్కుకోవడంతో ఆసీస్ పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు జట్టును 86 పరుగులకు చేర్చారు. రెండో రోజు భారత్ పై చేయి సాధించాలంటే మన బౌలర్లు రాణించాలి.. మరి ఏం చేస్తారో చూడాలి మరి !