- Home
- Sports
- Cricket
- సచిన్ బ్యాట్ ఎత్తితే ఔట్ చేద్దామనే ఫిక్స్ అయ్యా.. అనుకున్నట్టే చేశా : వివాదాస్పద టెస్టు గురించి షోయభ్ అక్తర్
సచిన్ బ్యాట్ ఎత్తితే ఔట్ చేద్దామనే ఫిక్స్ అయ్యా.. అనుకున్నట్టే చేశా : వివాదాస్పద టెస్టు గురించి షోయభ్ అక్తర్
Sachin Tendulkar Vs Shoiab Akhtar: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఎంత ఆసక్తి ఉంటుందో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ల మధ్య పోటీ కూడా అంతే ఆసక్తి ఉండేది.

క్రికెట్ లో కొన్ని ఘటనలు ఎప్పుడు గుర్తుకుతెచ్చుకున్నా కొత్తవిగానే ఉంటాయి. ఆ కోవలో తప్పకుండా ఉండేది సచిన్ టెండూల్కర్-షోయభ్ అక్తర్ ల మధ్య పోటీ. బంతికి బ్యాట్ కు జరిగిన అత్యుత్తమ సమరం అది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఈ ఇద్దరి మధ్య పలుమార్లు ఆధిపత్యం చేతులు మారినా చివరికి క్రికెట్ గెలిచింది. అయితే సచిన్ తో పోటీ అంటేనే ఎప్పుడూ ముందుండే అక్తర్.. తాజాగా అతడు గతంలో టెండూల్కర్ తో ఆడినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో అక్తర్ మాట్లాడుతూ.. 1999 లో ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో సచిన్ ను ఎలా ఔట్ చేశాననే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అక్తర్ స్పందిస్తూ.. ‘సచిన్ అప్పుడే క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు బాల్ కే నేను ద్రావిడ్ ను ఔట్ చేశాను. సచిన్ ను కూడా ఔట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఆ సమయంలో వసీం అక్రమ్ నా దగ్గరకు వచ్చాడు. రివర్స్ స్వింగ్ వేయాలని నాకు సూచించాడు.
లైన్ అండ్ లెంగ్త్ తో బంతిని విసురు. బాల్ పిచ్ మీద పడి పైకి లేవగానే స్వింగ్ అవ్వాలి. దాంతో అది నేరుగా వికెట్లను తాకుతుంది.. అని సలహా ఇచ్చాడు. నేనేమో సచిన్ ను ఔట్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను.
నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడే అనుకున్నా.. సచిన్ బ్యాట్ లేపగానే అతడు ఔట్ అవడం పక్కా అని.. నేను ప్లాన్ చేసిన డెలివరీనే ప్రణాళిక ప్రకారం వేశాను. ఫలితంతో నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ ఫలితం నాకు తెలుసు..’ అని చెప్పాడు.
ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో అక్తర్ ను ఎదుర్కున్న మొదటి బంతికే సచిన్ క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు బాల్ కే ద్రావిడ్ ను బౌల్డ్ చేసిన అక్తర్.. ఆ తర్వాత సచిన్ కూడా ఔట్ చేసి భారత్ ను దెబ్బకొట్టాడు.
ఈ టెస్టులో పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ టెస్టు మ్యాచ్ లో పాక్ విజయం కంటే ఈడెన్ గార్డెన్ లో పెద్ద రచ్చ జరిగిన విషయమే అందరికీ గుర్తుండి ఉంటుంది. ఈ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో సచిన్ రనౌట్ కు సంబంధించి పెద్ద దుమారం రేగింది.
రెండో ఇన్నింగ్స్ లో సచిన్ పరుగు తీస్తుండగా అక్తర్ కావాలనే సచిన్ ను ఢీకొట్టాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ క్రమంలో సచిన్ రనౌట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ దీనిని అవుట్ గా ప్రకటించడంతో స్టేడియంలో ప్రేక్షకులు రెచ్చిపోయారు. చివరికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి.. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగన్ మోహన్ దాల్మియాతో కలిసి వచ్చి ప్రేక్షకులను శాంతింపజేశాడు.