- Home
- Sports
- Cricket
- టార్గెట్ 400 అయితే మా జట్టు ఓటమి పక్కా.. టీమిండియా విజయం తథ్యం.. ఇంగ్లాండ్ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
టార్గెట్ 400 అయితే మా జట్టు ఓటమి పక్కా.. టీమిండియా విజయం తథ్యం.. ఇంగ్లాండ్ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు
ENG vs IND: ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇండియా ఇప్పటికే ఆధిక్యంలో కొనసాగుతున్నందున ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు.

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జబాస్టన్ లో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు విజయం ఖాయమంటున్నాడు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైకేల్ వాన్. ఈ టెస్టును టీమిండియా శాసించే స్థితికి వెళ్లిందని ప్రశంసలు కురిపించాడు.
ఈ టెస్టుపై టీమిండియా పట్టుబిగించిన నేపథ్యంలో క్రిక్ బజ్ తో వాన్ మాట్లాడుతూ.. ‘టీమిండియా ఇప్పటికే 250 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది. ఈ రన్స్ ను ఛేదించడమే కష్టం. ఇంక ఇండియా నాలుగో రోజు కూడా ఆడి 400 కు పైగా లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచితే దానిని ఛేదించడం చాలా కష్టం.
పిచ్ కూడా అందుకు అనుకూలించేలా కనిపించడం లేదు. బంతి కొంచెం స్పిన్ తిరగడంతో పాటు పేసర్లకు కూడా అనుకూలంగా మారుతుంది. దాంతో షమీకి చాలా ఉపయోగపడొచ్చు...’ అని అన్నాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో త్వరత్వరగా 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో టీమిండియాను ఆదుకున్న పుజారా, పంత్ పై వాన్ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు.
‘పుజారాను నా టెస్టు టీమ్ లోకి ఇవ్వండి. మీరు పంత్ కు ఎంత భయపడుతున్నారో పుజారాకూ అంతే భయపడాలి. పంత్ మాదిరి అతడు దూకుడుగా ఆడకపోవచ్చు గానీ డిఫెన్స్ తో ప్రత్యర్థిని బెదరగొడతాడు...’ అని అన్నాడు.
ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ తో ఆడినట్టు టీమిండియాతో కూడా ఆడటం ఇంగ్లాండ్ కు అచ్చిరాలేదని వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్ వ్యూహాలేవీ సరిగా పనిచేయలేదని బెన్ స్టోక్స్ అండ్ కో పై విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా విజయం తథ్యమని వాన్ స్పష్టం చేశాడు.