- Home
- Sports
- Cricket
- Jhulan Goswami: గోస్వామి ఖాతాలో మరో రెండు రికార్డులు.. ప్రపంచకప్ లో ఎవరూ సాధించని ఘనత సొంతం..
Jhulan Goswami: గోస్వామి ఖాతాలో మరో రెండు రికార్డులు.. ప్రపంచకప్ లో ఎవరూ సాధించని ఘనత సొంతం..
ICC Women's World Cup 2022: టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి మరో రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఇంగ్లాండ్ తో మ్యాచులో భారత్ కు ఓటమి ఎదురైనా...

భారత మహిళల జట్టు వెటరన్ క్రికెటర్ జులన్ గోస్వామి ఖాతాలో మరో రెండు అరుదైన ఘనతలు చేరాయి. ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా గోస్వామి.. ఆ జట్టు ఓపెనర్ బ్యూమౌంట్ ను ఔట్ చేయగానే ఈ రికార్డు సృష్టించింది.
బ్యూమౌంట్ ను ఔట్ చేయగానే ఆమె వన్డేలలో అత్యధిక వికెట్లు (250) తీసుకున్న బౌలర్ గా చరిత్ర సృష్టించింది. అంతేగాక అంతర్జాతీయ క్రికెట్ లో ఆమెకు ఇది 350వ వికెట్ కావడం గమనార్హం.
ఇక బ్యూమౌంట్ వికెట్ తో ఆమె ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా కూడా రికార్డు సృష్టించింది. ప్రపంచకప్ టోర్నీలలో ఇప్పటివరకు 39 వికెట్లు తీసుకున్న గోస్వామికి ఇది 40వ వికెట్.
దీంతో ఆమె ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ రికార్డును బ్రేక్ చేసింది. 1982 నుంచి 1988 వరకు జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లలో భాగమైన లిన్.. ఈ టోర్నీలో మొత్తంగా 39 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో గోస్వామి.. లిన్ రికార్డును సమం చేసింది.
భారత్ తరఫున ఐదు ప్రపంచకప్ లలో ప్రాతినిథ్యం వహిస్తున్న గోస్వామి.. తాజా రికార్డుతో ప్రపంచ మహిళా క్రికెట్ లో ఏ బౌలర్ కూడా సాధించలేని ఘనతను అందుకుంది.
ఈ టోర్నీలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో 2 వికెట్లు పడగొట్టిన గోస్వామి.. న్యూజిలాండ్ తో మ్యాచులో కూడా ఒక వికెట్ తీసింది. తాజాగా ఇంగ్లాండ్ తో మ్యాచులో కూడా ఒక వికెట్ తీసింది.
ఇదిలాఉండగా.. ఇంగ్లాండ్ తో జరిగిన గ్రూప్ మ్యాచులో భారత్ కు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. 31.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఆ జట్టు తరఫున సారథి నైట్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించింది.