ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి 8 ఏళ్లు బ్రేక్ ఎందుకొచ్చింది?
ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 1996 తర్వాత పాక్‌లో జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నీ ఇది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు 8 ఏళ్లు బ్రేక్ పడింది?

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. 1998లో ప్రారంభమైన ఈ టోర్నీని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
తొలి 5 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగాయి. ఆ తర్వాత రెండు సంవత్సరాలను 3 సంవత్సరాలకు పెంచారు. 2009 తర్వాత ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టోర్నీ నిర్వహించారు. అయితే, చివరగా 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నిలిచిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు నిలిపివేశారు?
ఛాంపియన్స్ ట్రోఫీని చివరిసారిగా 2017లో నిర్వహించారు. ఇప్పుడు అంటే 2025 ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ జరగనుంది. దీనికి ప్రధాన కారణం ఛాంపియన్స్ ట్రోఫీని నిలిపివేసి, దాని స్థానంలో ఏడాదికి ఒక టీ20 ప్రపంచ కప్ నిర్వహించాలని ఐసీసీ భావించింది. అందుకే 2021లో టోర్నీ జరగలేదు. కానీ ఐసీసీ ఆలోచన వన్డే క్రికెట్‌కు ప్రమాదకరమని చాలామంది అభిప్రాయపడటంతో 2025 నుంచి టోర్నీని పునఃప్రారంభించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఇప్పటి నుంచి ఏడాదికి ఒక ఐసీసీ టోర్నమెంట్
ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి ప్రవేశపెట్టడంతో ఇకపై ఏడాదికి ఒక ఐసీసీ టోర్నీ జరుగుతుంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచ కప్, 2027లో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2028లో వన్డే ప్రపంచ కప్ జరుగుతాయి. అంటే ప్రతి ఏడాదికి ఒక ఐసీసీ టోర్నమెంట్ వుండనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణతో పాక్‌కు కోట్ల ఆదాయం!
ఏదైనా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశానికి డబ్బు వరదలా వస్తుందని చెప్పవచ్చు. పాన్సర్‌షిప్, టికెట్ల అమ్మకాల ద్వారా భారీగా డబ్బు సమకూరుతుంది. వీటన్నింటికంటే ఎక్కువగా ఐసీసీ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ప్రసార హక్కుల అమ్మకం, స్పాన్సర్‌షిప్ ద్వారా ఐసీసీ వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. దీంట్లో ఎక్కువ భాగాన్ని టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశానికి అందిస్తుంది. ఒక అంచనా ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా పీసీబీకి ఐసీసీ నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా సహాయం అందుతుంది.
పోరాడి ఆతిథ్య హక్కును నిలుపుకున్న పాక్!
టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగినా, ఆతిథ్య హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వద్దే ఉంది. అంటే, టోర్నీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పీసీబీ చేస్తుంది. మొత్తం టోర్నీని వేరే దేశానికి మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. దక్షిణాఫ్రికా లేదా ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న యూఏఈకి టోర్నీని మార్చవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ, చాలా కష్టపడి పీసీబీ ఆతిథ్య హక్కును నిలుపుకుంది.
Ind vs Pak
1996 తర్వాత పాక్‌లో ఐసీసీ టోర్నీ!
పాకిస్తాన్‌లో చివరిసారిగా ఐసీసీ టోర్నీ జరిగింది 1996లో. భారత్, శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు, 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్తాన్ ఉత్సాహంగా ఉంది.