- Home
- Sports
- Cricket
- Rohit Sharma: దాని గురించి ఇప్పుడెందుకు.. వదిలేయండి.. కీలక ప్రశ్నకు సమాధానం దాటవేసిన హిట్ మ్యాన్
Rohit Sharma: దాని గురించి ఇప్పుడెందుకు.. వదిలేయండి.. కీలక ప్రశ్నకు సమాధానం దాటవేసిన హిట్ మ్యాన్
India vs West Indies: పరిమిత ఓవర్లలో భారత జట్టు కొత్త సారథి రోహిత్ శర్మ ఆదివారం నుంచి వెస్టిండీస్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే తొలి వన్డే మ్యాచుతో పూర్తిస్థాయి కెప్టెన్ గా మారుతున్నాడు.

వన్డే, టీ20 లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ నే టెస్టులలో కూడా సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిమీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
విండీస్ తో సిరీస్ సందర్భంగా పాత్రికేయులు.. తర్వాతి టెస్టు సారథి కూడా మీరేనా..? అని ప్రశ్నించారు. దీనికి హిట్ మ్యాన్ మాట్లాడుతూ... ‘దానికింకా టైమ్ ఉంది కదా.. ఇప్పటికైతే నా దృష్టంతా పరిమిత ఓవర్ల సిరీస్ ల మీదే ఉంది.
వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యమైనదే. దానివల్ల మేము పదే పదే ఆటగాళ్లను మార్చాల్సి వస్తున్నది. ఆ కారణంగా మేము కొన్ని సిరీస్ లు కూడా కోల్పోయాం. కానీ మేము అన్నింటికీ సిద్ధపడే ఉన్నాం.
టెస్టు కెప్టెన్సీ గురించి వదిలేయండి.. దాని గురించి నాకు ఏ సమాచారమూ లేదు. ప్రస్తుతానికి నేను విండీస్, శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ మీదే దృష్టి పెట్టాను..’ అని అన్నాడు.
పలు నాటకీయ పరిణామాల మధ్య దక్షిణాఫ్రికాలో సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీ కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటికే టీ20, వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ కే టెస్టు పగ్గాలు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సీనియర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
కొంతమంది అన్ని ఫార్మాట్లకు హిట్ మ్యానే సారథిగా ఉండాలని అభిప్రాయపడుతుండగా మరికొందరేమో.. ఫిట్నెస్ అతడికి ప్రధాన సమస్య అని, దాంతో టెస్టు కెప్టెన్సీ ని రోహిత్ కు గాక రాహుల్, పంత్, బుమ్రా కు అప్పజెప్పాలని అంటున్నారు. ఇదిలాఉండగా.. టీమిండియా టెస్టు సారథ్యం గురించి బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఇన్నాళ్లు విరాట్ సారథ్యంలో ఆడిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పుడు మాజీ కెప్టెన్ ఆడున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఎలా ఆడతాడు..? అనే ప్రశ్నపై రోహిత్ మాట్లాడుతూ.. ‘విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను వైస్ కెప్టెన్ గా ఉన్నాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి.
విరాట్ ఎక్కడైతే నిష్క్రమించాడో నేను అక్కడ్నుంచే మొదలుపెడతాను. ఒక ఆటగాడిగా కోహ్లి నుంచి జట్టు ఏం ఆశిస్తుంతో అతడికి తెలుసు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటగాళ్లు తమను తాము మలుచుకోవాలి. నేను మార్పులు చేయాల్సిన పన్లేదు...’ అని అన్నాడు.