‘వాళ్లంతా టీ20 స్పెషలిస్టులే.. తొలి టీ20లో వాళ్లను ఓడించడం టీమిండియాకు కష్టమే..’
ENG vs IND T20I: ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడిన టీమిండియాకు గురువారం జరుగబోయే తొలి టీ20లో ఓటమి తప్పదని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్ తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పదని అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. భారత జట్టుతో పోల్చితే ఇంగ్లాండ్ అన్ని రంగాల్లో బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
Image credit: PTI
తొలి టీ20కి ముందు అతడు తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పూర్తిస్థాయి టీ20 స్పెషలిస్టులతో బరిలోకి దిగుతున్నది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్, లివింగ్ స్టన్ వంటి ఆటగాళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగలరు.
ఈ మ్యాచ్ లో బట్లర్-మలన్ లు 75 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేసే అవకాశముంది. బట్లర్ ను అడ్డుకోవడం చాలా కష్టం. ఇంగ్లాండ్ గత ఐదు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. అయితే ఈ మ్యాచులలో బట్లర్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. డేవిడ్ మలన్ కూడా దాటిగా ఆడగలడు.
ఇక భారత్ విషయానికొస్తే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు 70 ప్లస్ స్కోరు చేసే అవకాశముంది. మూడో స్థానంలో సంజూ శాంసన్, దీపక్ హుడాలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి..’ అని చోప్రా అన్నాడు.
రెండు జట్ల బలాబలాలను పోల్చితే తొలి టీ20లో ఇండియాపై గెలిచే అవకాశాలు ఇంగ్లాండ్ కే మెండుగా ఉన్నాయని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగానే కనిపిస్తున్నా బ్యాటింగ్ లో చూసుకుంటే ఇంగ్లాండ్ బలంగా ఉందని అన్నాడు.
అంతేగాక ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 15 సిక్సర్లు నమోదు చేస్తాయని చోప్రా జోస్యం చెప్పాడు. పరుగుల వరద ఖాయమని.. విజయం మాత్రం ఇంగ్లాండ్ దే అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్ కు అతడు భారత్ తరఫున ఆడబోయే ప్లేయింగ్ ఎలవెన్ ను కూడా అంచనావేశాడు. ఈ మ్యాచ్ లో అతడు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తో పాటు అర్షదీప్ సింగ్ లకు చోటు కల్పించలేదు. చోప్రా జట్టు ఇలా ఉంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్